జనసేన అధినేత పవన్‌కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ టీజీ వెంకటేష్ స్పందించారు. అంతేకాదు పవన్‌కు ఆయన పలు సూచనలు చేశారు. పవన్‌ ఆవేశంతోకాదని, ఆలోచించి మాట్లాడాలని టీజీ సూచించారు. తాను ఏం మాట్లాడానో విని స్పందించి ఉంటే బాగుండేదన్నారు. కార్యకర్తలకు ఆవేశం ఉండొచ్చు కానీ లీడర్లకు ఆవేశం ఉండకూడదని సలహా ఇచ్చారు. తాము టీడీపీలో కార్యకర్తలం మాత్రమేనని, పొత్తులను నిర్ణయించేది కార్యకర్తలు కాదని, పార్టీల అధినేతలేనని టీజీ వెంకటేష్‌ చెప్పారు. పొత్తులపై ఆయా పార్టీల అధినేతలే నిర్ణయిస్తారని చెప్పాను. పొత్తులు ఖరారైతే మార్చిలో చర్చలు ఉంటాయనే చెప్పాను అని టీజీ వెంకటేశ్‌ వివరించారు.

tg ven 23012019

జనసేనతో పొత్తులపై టీడీపీ వెంకటేష్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్‌ అమరావతిలో విలేకర్లతో మాట్లాడారు. తెదేపా, జనసేన మధ్య పెద్దగా విభేదాలు లేవని అన్నారు. కేవలం కేంద్రంపై పోరాటం చేసే విషయంలోనే రెండు పార్టీలకు అభిప్రాయ భేదాలున్నాయని వ్యాఖ్యానించారు. సీఎం కుర్చీపై ఆశ లేదని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ గతంలో చాలాసార్లు చెప్పారని గుర్తు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీ కలిసినప్పుడు ఏపీలో తెదేపా, జనసేన కలిస్తే తప్పేంటని టీజీ ప్రశ్నించారు. తెదేపాతో జనసేన కలిసేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు.

 

tg ven 23012019

అయితే టీజీ వ్యాఖ్యలపై జనసేనాని మండిపడ్డారు. ‘‘టీజీ వెంకటేష్‌ పిచ్చిపిచ్చిగా మాట్లాడితే సహించేది లేదు. జనసేన వద్దనుకుంటే టీజీకి రాజ్యసభ సీటు ఇచ్చారు. టీజీ వెంకటేష్‌...పెద్దమనిషిగా మాట్లాడు. లేదంటే నేను నోరు అదుపు తప్పి మాట్లాడుతా. నేను నోరు విప్పితే మీరు ఏమవుతారో?’’ అని పవన్ ప్రశ్నించారు. ఆయన ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. విశాఖ జిల్లా పర్యటనలో పవన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. 2019లో జనసేన అధికారంలోకి వస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

Advertisements