ఇంద్రకీలాద్రి పై వెల‌సిన జ‌గ‌న్మాత క‌న‌క‌దుర్గమ్మ ఆల‌యంలో అంతరాలయం టిక్కెట్‌ ధరలను తగ్గిస్తూ పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. రూ.300 టికెట్‌ ధరను రూ.150కు, రూ.100 టికెట్‌ ధరను రూ.50కు తగ్గించాల‌ని దుర్గగుడి పాలక మండలి తీర్మానం చేసింది. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే తగ్గించిన ధరలు అమలులోకి వస్తాయని ఆలయ ఛైర్మన్ య‌ల‌మంచిలి గౌరంగబాబు తెలిపారు.

సోమ‌వారం ఉద‌యం విజ‌య‌వాడ పాత‌బ‌స్తీలోని మాడపాటి వసతిగృహంలో జరిగిన పాల‌క‌మండ‌లి సమావేశంలో ఆలయ ఈవో సూర్యకుమారి, పాలకమండలి ఛైర్మన్‌ గౌరంగబాబుతో పాటు సభ్యులు హాజరయ్యారు. ఈ సంద‌ర్భంగా సమావేశంలో ప‌లు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఇంద్రకీలాద్రి పై దసరా నవరాత్రుల ఏర్పాట్లు, గుడిపై జరుగుతున్న అభివృద్ధి పనులు, ఆలయంలో కొత్త పూజల ప్రారంభం తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. దసరా ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోనున్నట్టు ఈవో సూర్యకుమారి తెలిపారు. ఉత్సవాల సమయంలో ఘాట్‌ రోడ్డు ద్వారానే భక్తులను అనుమతిస్తామన్నారు. రెండు కొత్త పూజలకు పాలకమండలి ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు.

ఈ సమావేశ ఏజెండాలో మొత్తం 47 ప్రతిపాదనలు రాగా వాటిలో 45 ప్రతిపాదనలకు ఆమోదం లభించిందని వివ‌రించారు.

Advertisements