కేంద్రంలో ప్రధాని మోదీ వ్యతిరేక ప్రభుత్వం ఏర్పడి, ప్రాంతీయ పార్టీలకే ప్రధాని పదవి ఇవ్వాలన్న ఆలోచన వస్తే అది చంద్రబాబుకు దక్కే అవకాశాలున్నాయని మాజీ ఎంపీ, సీనియర్‌ నేత ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం నిర్వహించిన ‘మీట్‌ ద ప్రెస్‌’ కార్యక్రమంలో ఉండవల్లి పాల్గొన్నారు. ‘‘మోదీ వ్యతిరేక శక్తులను ఏకంచేయడంలో, ఆయనను ఎదిరించడంలో మమత, మాయావతికంటే చంద్రబాబు ముందున్నారు. కేంద్రంలో మోదీ వ్యతిరేక కూటమి అధికారంలోకి వచ్చి ప్రాంతీయ పార్టీలకు అవకాశం ఇవ్వాల్సి వస్తే... చంద్రబాబు ప్రధాని అయ్యే అవకాశం ఉంది. అయితే, టీడీపీ పది లేదా అంతకంటే ఎక్కువ ఎంపీ స్థానాలు గెలుచుకోవాలి’’ అని ఉండవల్లి అభిప్రాయపడ్డారు.

undvalli 8052019

చంద్రబాబుపై 17 కేసులున్నాయని రాజకీయ విమర్శలు చేయడం సహజమే అయినప్పటికీ, ఆయన 3 కేసులు మినహా అన్నీ కొట్టేయించుకున్నారని ఉండవల్లి చెప్పారు. ఆయనపై వైఎస్‌ విజయలక్ష్మి వేసిన కేసులతో సహా అన్ని కేసులు కొట్టేశారన్నారు. ఇటీవల లక్ష్మీపార్వతి కేసు మళ్లీ బయటకు వచ్చిందన్నారు. ఏలేరు స్కామ్‌తో చంద్రబాబుకు ప్రత్యక్షంగా సంబంధం లేదని... ఇది ప్రభుత్వంపై ఉన్న కేసు అని ఉండవల్లి చెప్పారు. ఇక... పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై తనకు ఎన్నో సందేహాలున్నాయని ఉండవల్లి అన్నారు. ‘‘కాఫర్‌డ్యామ్‌నే ఆధారంగా చేసుకుని గోదావరి జలాలను మళ్లిస్తారని చెబుతున్నారు. అదే జరిగితే గోదావరి జలాల ఉధృతికి రాజమండ్రి నుంచి పోలవరం దాకా కొట్టుకుపోతాయి’’ అని ఆందోళన వ్యక్తం చేశారు.

undvalli 8052019

ఒకవైపు పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేశారని.. పురుషోత్తపట్నం ద్వారా ఎడమ ప్రధాన కాలువ ద్వారా జలాలను విశాఖకు తరలించే ప్రయత్నం చేస్తున్నారని... ఇంతలో పోలవరం డ్యామ్‌ నిర్మాణంలో తొందరేమొచ్చిందని ఉండవల్లి ప్రశ్నించారు. పోలవరం డ్యామ్‌ నిర్మాణంలో తన సందేహాలు నివృత్తి చేయాలని కోరుతున్నా ప్రభుత్వం ఆలకించడం లేదన్నారు. తన సందేహాలను జల వనరుల శాఖ అధికారులు ఎవరైనా తీరిస్తే .. ఇప్పటిదాకా దేవుడిలాంటి వారిని విమర్శించినందుకు క్షమాపణలు చెబుతానని ఉండవల్లి వ్యాఖ్యానించారు. ఈవీఎంలపై సందేహాలను ప్రస్తావిస్తూ... వీవీ ప్యాట్‌ల లెక్కింపులో ఏమైనా పొరపొట్లు దొర్లితే మొత్తం వీవీ ప్యాట్‌లను లెక్కించాల్సిన పరిస్థితి నెలకొంటుందని ఉండవల్లి చెప్పారు.

Advertisements