విజయవాడ విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభమవ్వడానికి ముహూర్తం ఖరారైంది. ఇందులో భాగంగా ఈ నెల 25న గన్నవరం నుంచి సింగపూర్‌కు అంతర్జాతీయ విమాన సర్వీసులను తొలుత నడపనున్నారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ విమానాశ్రయాల అభివృద్ధి సంస్థ, ఇండిగో సంస్థ తేదీని ఖరారు చేస్తూ ఒప్పందం కుదుర్చుకున్నాయి. విమానాశ్రయం అధికారులకు సైతం సిద్ధంగా ఉండాలంటూ శుక్రవారం సమాచారం అందించారు. గన్నవరం విమానాశ్రయం నుంచి సింగపూర్‌కు అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభమైతే.. ఈ ప్రాంతానికి దేశవిదేశాలతో అనుసంధానం ఏర్పడినట్లే. ప్రపంచంలోనే ప్రముఖ వాణిజ్య, వ్యాపార కేంద్రమైన సింగపూర్‌కు విజయవాడ నుంచి నేరుగా మూడు గంటల్లో చేరిపోవచ్చు.

gannavaram 06102018

అక్కడి నుంచి ప్రపంచమంతటికీ విమాన సర్వీసులు పుష్కలంగా అందుబాటులో ఉంటాయి. ఏ దేశానికైనా తేలికగా చేరిపోయేందుకు అవకాశం ఉంటుంది. అంతర్జాతీయ ప్రయాణికులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందులు తొలగిపోతాయి. ప్రయాణ ఛార్జీలతో పాటూ ప్రయాస తగ్గిపోతుంది. సింగపూర్‌తో భారతదేశానికి బలమైన వ్యాపార సంబంధాలు ఉన్నాయి. సముద్ర మార్గంలో నౌకల ద్వారా జరిగే రవాణా చాలావరకు సింగపూర్‌, దుబాయ్‌ మీదుగానే ఇతర దేశాలకు చేరుకుంటాయి. సింగపూర్‌కు ఏటా కోస్తా ప్రాంతం నుంచి వెళ్లేవారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. . రోజూ హైదరాబాద్‌ నుంచి సింగపూర్‌, దుబాయ్‌లకు ఆరు విమాన సర్వీసులు నడుస్తున్నాయి. ఇక్కడి నుంచి రోజూ ఒక్క విమాన సర్వీసును సింగపూర్‌, దుబాయ్‌కు నడిపితే.. వెసులుబాటు కలుగుతుందని ఎప్పటినుంచో ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు.

gannavaram 06102018

మరో పక్క, విమానాశ్రయంలో ప్రస్తుతం 7500 అడుగుల రన్‌వే ఉంది. దీనిని 11,023 అడుగులకు పెంచుతున్నారు. కొత్తగా 3523 అడుగులు పొడిగిస్తున్నారు. రూ.148 కోట్ల బడ్జెట్‌ అంచనా వేయగా.. ప్రస్తుతం రూ.120 కోట్ల వరకూ ఖర్చవుతోంది. రన్‌వే విస్తరణ పనులను 2017 ఏప్రిల్‌ నుంచి ప్రారంభించారు. 20 నెలల్లో అనుకున్న లక్ష్యంలోగానే పనులను పూర్తి చేస్తున్నారు. విమానాశ్రయం డైరెక్టర్‌ జి.మధుసూదన్‌రావు దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టి అనుకున్న లక్ష్యంలోగా పూర్తిచేసేందుకు ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఉన్న 7500 పొడవైన రన్‌వే అంతర్జాతీయ సర్వీసులు నడిపేందుకు అనువుగానే ఉంది. భవిష్యత్తులో రద్దీ మరింత పెరిగాక.. అవసరాల దృష్ట్యా రన్‌వేను పొడిగిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి నుంచి కొత్త రన్‌వేపై సర్వీసులు రాకపోకలు సాగించనున్నాయి.

Advertisements