నిన్న విజయవాడలో జరిగిన పాప కిడ్నాప్ కేసు, వార్తా ప్రసారాల్లో హాల్ చల్ చేసింది. ఒక ఛానల్ అయితే, ఎదావిధగా, అమరావతిలో శాంతిబధ్రతలు లేవు అంటూ ప్రచారం మొదలు పెట్టారు. అయితే బెజవాడ పోలీసులు మాత్రం, ఇవేమీ పట్టించుకోకుండా, 24 గంటల్లో కేసు ఛేదించారు. విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో ఐదేళ్ల పాప ఆదివారం అదృశ్యమైంది. కొన్ని గంటల తర్వాత నరసరావుపేటలో ప్రత్యక్షమైంది. పోలీసులు, తల్లిదండ్రుల కథనం మేరకు.. శ్రీకాకుళానికి చెందిన పైడి రాజు, శాంతి శ్రీ దంపతులు, వారి కుమార్తే నవ్యశ్రీ(5) శనివారం తిరుపతి వెళ్లి వెంకటేశ్వరస్వామి దర్శనం అనంతరం దుర్గమ్మను దర్శించుకునేందుకు విజయవాడ వచ్చారు. ఆదివారం ఉదయం బయట తలనీలాలు సమర్పించారు. అనంతరం అమ్మవారి దర్శనానికి వెళ్తున్న సమయంలో పాప అదృశ్యమైంది.

police 18062018 2

ఆ బాలిక ఆచూకీ కోసం తల్లిదండ్రులు దుర్గగుడి అధికారులను ప్రాధేయపడినా వారు పట్టించుకోకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిసి కెమెరాల ద్వారా పాపను గుర్తించేందుకు వారు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే నవ్యశ్రీ ఆచూకిని నర్సరావుపేటలో పోలీసులు గుర్తించారు. బాలికను కిడ్నాప్‌ చేసిన వారినీ అదుపులోకి తీసుకున్నారు. విజయవాడలో నవ్యశ్రీని కిడ్నాప్‌ చేసిన దంపతులు విజయవాడ రైల్వేస్టేషన్‌లో నరసరావుపేటకు టిక్కెట్లు కొని ప్యాసింజర్‌ రైలులో వెళ్లినట్టు గుర్తించారు. నర్సరావుపేట రైల్వేస్టేషన్‌లో డిఎస్‌పి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిఘా ఉంచారు. రైలు నరసరావుపేటకు రాగానే దంపతులతో పాటు బాలికను అదుపులోకి తీసుకున్నారు.

police 18062018 3

ఇదిలా ఉండగా నిందితులు నరసరావుపేట వడ్డెర బజారుకు చెందిన సుబ్బలక్ష్మీ నర్సరావుపేటలో ఒక ప్రయివేటు నర్సింగ్‌ హోంలో నర్సుగా పని చేస్తోంది. ఆమె ఆమె భర్త, ఇతర కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తమకు ఈ పాప ఏడుస్తూ కన్పించిందని, పాప తాలుకూ ఎవ్వరూ కన్పించకపోవడంతో తీసుకొచ్చామని అంటున్నారు. తమకు ఒక కుమారుడు ఉన్నాడని, కిడ్నాప్‌ చేసే ఉద్దేశమేమీ లేదని చెప్పారు. పోలీసులకు విజయవాడలోని అప్పగిద్దామనుకున్నా పెళ్లి పనుల నిమిత్తం అత్యవసరంగా రావాలని ఇంటిదగ్గర నుండి ఫోన్‌ రావడంతో బాలికను నరసరావుపేటలోనే అప్పగిద్దామని వచ్చామని, కాకపోతే ఇక్కడ పనుల్లో పడి బాలికను పోలీసులకు అప్పగించడం ఆలస్యమైందని చెబుతున్నారు. ఈ మాటలను పోలీసులు విశ్వసించడంలేదు. కిడ్నాప్‌ కోణంలోనే విచారిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న తల్లిదండ్రులు నరసరావుపేట పోలీసుస్టేషన్‌కు వెళ్లగా వారికి ఆ చిన్నారిని అప్పగించారు.

Advertisements