వారం రోజుల క్రితం విజయవాడ పోలీసులు, ప్రజలు త‌మ సమస్యలను పోలీసులకు వాట్సప్ ద్వారా ఫిర్యాదు చేసేందుకు నూతన వాట్సాప్ నెంబర్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఎవరైనా సమస్య ఉంటే 7328909090 నంబర్‌కు ఫొటోలు, వీడియోలు పంపాలని ఈ సంద‌ర్భంగా డీజీపీ ఆర్పీ ఠాకూర్ ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. అయితే, ప్రజల సౌకర్యార్థం విజయవాడ పోలీసులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాట్సాప్‌ నెంబరుకు జనాల నుంచి ఊహించని బెడద ఎదురవుతుండటంతో పోలీసులు తలపట్టుకుంటున్నారు. ప్రజలు 'గుడ్‌మార్నింగ్‌', 'గుడ్‌నైట్‌', 'కంగ్రాట్స్‌' మెసేజ్‌లు పెడుతున్నారట. అసలు ఫిర్యాదుల కన్నా ఈ కొసరు మెసేజ్ లు పోటెత్తుతుండటంతో పోలీసులు అల్లాడిపోతున్నారట.ప్రజలు తమని ఇలా శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నందుకు సంతోషపడాలో, ఫిర్యాదుల కన్నా ఇలా అనవసరమైన మెసేజ్ లు ఇస్తున్నందుకు బాధపడాలో అర్ధం కాక తలపట్టుకుంటున్నారట.

wa 180802018 2

విజయవాడ పోలీస్ వాట్సాప్‌ నెంబరుకు నాలుగు రోజులుగా మొత్తం 532 మెసేజ్‌ల రూపంలో ఫిర్యాదులు వచ్చాయి...ఇందులో 363 మెసేజ్‌లు కేవలం పోలీసులను అభినందిస్తూ ‘కంగ్రాట్స్‌.. గుడ్‌మార్నింగ్‌.. గుడ్‌నైట్‌' అంటూ వచ్చాయి, తొలిరోజు గురువారం అత్యధికంగా 140, శుక్రవారం 128, శనివారం 69, ఆదివారం 26 వచ్చాయి. ఇవే కాకుండా మరో 140 మెసేజ్‌లు విజయవాడ నగరం వెలుపల నుంచి వారి పరిధిలోకి రాని ప్రాంతాల నుంచి కూడా వచ్చాయి. ఇలా అనవసర మెసేజ్‌ వల్ల దీనిని ఏర్పాటు చేసిన ఉద్దేశం నెరవేరకుండా పోతుందని, ఎవరికైనా సమస్యలుంటేనే ఈ నెంబరుకు మేసేజ్‌లు పెట్టాలని పోలీసు అధికారులు కోరుతున్నారు.

wa 180802018 3

మిగతా సమస్యలు,ఫిర్యాదులకు పరిష్కారం విషయం అటుంచితే ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ఈ యాప్ బాగా ఉపయోగపడుతోందట. ట్రాపిక్ ఇబ్బందుల గురించి ఈ వాట్సాప్‌ నెంబరుకు మొత్తం 29 ఫిర్యాదులు వచ్చాయని...అందులో అత్యధికంగా నగరంలో ట్రాఫిక్‌ సమస్యలు, ట్రాఫిక్ జామ్ లను తెలుపుతూ సందేశాలు వచ్చాయని పోలీసులు తెలిపారు. ఇలా విజయవాడ నగరంలోని ట్రాఫిక్‌ సమస్యలకు సంబంధించి 14 మేసేజ్‌లు రాగా...వాటన్నింటినీ పోలీసులు యుద్ధప్రాతిపదికన పరిష్కరించారట. అలాగే శాంతిభద్రతలకు సంబంధించి 12 రాగా...వాటిలో ఎనిమిదిటిపై విచారణ కొనసాగుతోందని వెల్లడించారు.

Advertisements