మెడికల్‌ హబ్‌గా విశాఖ నగరాన్ని మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా దేశంలోనే తొలిసారిగా వైద్య ఉపకరణాల గ్లోబల్‌ ఫోరంనకు విశాఖ వేదిక కానుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ సదస్సు విశాఖ నగర శివారులోని మెడ్‌టెక్‌ జోన్‌లో గురువారం ఉదయం ప్రారంభమై మూడు రోజులు జరగనుంది. 120 దేశాల నుంచి 2 వేల మంది ప్రతినిధులు హాజరయ్యే ఈ సదస్సును రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. రెండో రోజు కేంద్ర మంత్రి సురేష ప్రభు, మూడో రోజు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ముఖ్య అతిథిలుగా హాజరు కానున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో వైద్య రంగ ఉపకరణాల తయారీలో పాటించాల్సిన ఉత్తమ ప్రమాణాలు, ఎదురవుతున్న సవాళ్లు, నూతన విధానాలు, నియంత్రణలు ఉపకరణాలపై విశ్లేషణలు, వాటి నిర్వహణపై చర్చించారు.

amtz 13122018 2

అత్యధిక ప్రజలకు అత్యాధునిక వైద్య విధానాలు అందుబాటులోకి వచ్చే విధంగా ఎలాంటి చర్యలు చేపట్టాలన్న అంశం పైనా మేధోమధనం చేస్తారు. ఇందుకోసం డబ్ల్యుహెచ్‌ఓ అందిస్తున్న సేవల్ని వివరిస్తారు. ప్రపంచంలోనే తొలిసారిగా అత్యధిక వైద్య పరికరాలను ఒకే చోట తయారు చేసి వివిధ దేశాలకు ఎగుమతి చేసేందుకు విశాఖ నగరంలో ఏర్పాటు చేసిన మెడ్‌టెక్‌ జోన్‌ను గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు జాతికి అంకితం చేస్తారు. మరో పక్క, భీమిలిలోని పావురాల కొండపై రాష్ట్ర ప్రభుత్వం యునెస్కో ఎం.జి.ఐ.ఇ.పి. భాగస్వామ్యంతో ప్రపంచ విద్యారంగ అవసరాలు తీర్చేలా ఇంటిలిజెంట్‌ గ్లోబల్‌ హబ్‌ ఫర్‌ డిజిటల్‌ పెడగాగీస్‌(ఐహబ్‌ -ఐజిహెచ్‌డిపి) ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టింది.

amtz 13122018 3

తొలుత 50 ఎకరాల విస్తీర్ణంలో రాబోతున్న ఐహబ్‌లో గేమింగ్‌ సంస్థలు, పరిశోధన సంస్థలు, శిక్షణ సంస్థలు, అంకుర సంస్థలు, డిజైన్‌ విశ్వవిద్యాలయం తదితరాలన్నీ కొలువుదీరనున్నాయి. ఐహబ్‌కు కేటాయించడంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం శంకుస్థాపన చేసిన వెంటనే నిర్మాణ పనులను కూడా చేపట్టనున్నారు. దశలవారీగా రూ.700కోట్ల పెట్టుబడితోపాటు వేలాది ఉద్యోగాలు ఐహబ్‌లో ఏర్పడబోయే సంస్థల్లో అందుబాటులోకి రానున్నాయి. విద్యార్థులు సమర్థంగా పలు విషయాలను, నైపుణ్యాలను నేర్చుకోవడానికి ఎలాంటి బోధన పద్ధతులు అనుసరించాలన్న అంశంపై మరిన్ని శాస్త్రీయ అధ్యయనాలు జరగాల్సి ఉందని ప్రపంచవ్యాప్తంగా విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో విశాఖ ఐహబ్‌లో ‘న్యూరోసైన్స్‌ పరిశోధన కేంద్రం’ ఏర్పాటు చేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా విద్యార్థుల ఆకళింపు నైపుణ్యాలపై అధ్యయనం చేస్తున్న న్యూరాలజీ శాస్త్రవేత్తలను దశలవారీగా పిలిచి విశాఖ కేంద్రంలో పరిశోధనలు చేయిస్తారు.

Advertisements