మాజీ ప్రధాని, భారతరత్న అటల్‌ బిహారీ వాజ్‌పేయి మృతితో దేశవ్యాప్తంగా విషాదం నెలకొంది. కేంద్ర ప్రభుత్వం ఏడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. దాదాపు 13 రాష్ట్రాలు శుక్రవారం సెలవు దినంగా ప్రకటించాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. ఏపీలోనూ ఏడు రోజులపాటు సంతాప దినాలుగా పాటిస్తామని ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు తెలిపారు. వాజ్‌పేయి నిరంతరం పని కోరుకునే వ్యక్తి అని, ఆయన సెలవును ఇష్టపడరని, అందుకే తాము సెలవు ప్రకటించలేదని వెల్లడించారు. ఇక ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, మధ్యప్రదేశ్‌, బిహార్‌, తమిళనాడు, పుదుచ్చేరి తదితర ప్రభుత్వాలు శుక్రవారం సెలవు దినంగా ప్రకటించాయి.

cbn vajpayee 17082018 2

మరో పక్క, సీఎం చంద్రబాబునాయుడు ఢిల్లీ వెళ్లి, వాజ్ పేయి పార్ధీవ దేహానికి నివాళులర్పించారు. "అన్ని సంస్కరణలకు ఆద్యుడు.. వాజ్ పేయి గారి మృతి దేశానికి తీరని లోటు, వాజ్ పేయి గారి ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుణ్ని ప్రార్దిస్తున్నానని" ఆయన పేర్కొన్నారు. 'ఆయన నాకంటే 26 సంవత్సరాలు పెద్ద.. ఎన్టీఆర్‌ ఉన్నప్పుడు, నేషనల్‌ ఫ్రంట్‌ ఉన్నప్పుడు కలిసి పనిచేశాం.. ఎన్టీఆర్‌ ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేసినప్పుడు ఆయన సహకరించారు. నేను తెదేపా అధ్యక్షుడిగా, ఎన్టీయే కన్వీనర్‌గా ఉన్నప్పుడు ఎంతో సహకారం అందించారు. ’ అని చంద్రబాబు గుర్తుచేశారు.

cbn vajpayee 17082018 3

వాజ్‌పేయీని కడసారి చూసేందుకు వివిధ రంగాల ప్రముఖులు తరలివస్తున్నారు. దేశానికి ఎనలేని సేవలందించిన మహానేతకు నివాళులర్పిస్తున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, కేరళ, తమిళనాడు రాష్ట్రాల గవర్నర్లు పి.సదాశివం, భన్వరీలాల్‌ పురోహిత్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌, నేవీ చీఫ్‌ సునీల్‌ లాంబా, ఆర్మీ చీఫ్‌ బిపిన్‌ రావత్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌ తదితరులు మాజీ ప్రధానికి నివాళులర్పించారు. వాజ్‌పేయీ అంత్యక్రియలు యమునానది ఒడ్డున రాష్ట్రీయ స్మృతి స్థల్‌లో ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు్ల చేస్తోంది. మధ్యాహ్నం ఒంటిగంటకు వాజ్‌పేయీ అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. సాయంత్రం 4గంటలకు రాష్ట్రీయ స్మృతి స్థల్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

Advertisements