భాజపా రాజకీయ పాచికలను బట్టబయలు చేసిన ఆడియో బాంబు.. కొత్త రూపు సంతరించుకుంది. బడ్జెట్‌కు ముందు ముఖ్యమంత్రి విడుదల చేసిన ఈ ఆడియో పూర్తి భాగం బుధవారం మాధ్యమాల్లో మరో సంచలనంగా మారింది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప, ఎమ్మెల్యేలు శివనగౌడ నాయక్‌, ప్రీతమ్‌ గౌడ, దళ్‌ ఎమ్మెల్యే తనయుడు శరణేగౌడ దాదాపు 80 నిమిషాల పాటు సంభాషణల్లో పాల్గొన్నట్లు ఇందులో గుర్తించారు. ఈ ఆడియోలో స్పీకర్‌ రమేశ్‌కుమార్‌, ప్రధానమంత్రి నరేంద్రమోది, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, మాజీ ప్రధాని దేవేగౌడలపై మరింత స్పష్ట సంభాషణలు వినిపించాయి. తన కుమారుడు విజయేంద్రను ‘ఆపరేషన్‌ కమల’ ప్రక్రియకు కీలక బాధ్యుడంటూ యడ్యూరప్ప ప్రత్యేకంగా శరణగౌడతో చెప్పటం, హాసన భాజపా ఎమ్మెల్యే ప్రీతమ్‌ గౌడ దేవేగౌడ, కుమారస్వామిల ఆరోగ్యంపై చర్చించటం వివాదంగా మారాయి.

audio 14022019

ఇప్పటికే స్పీకర్‌పై వచ్చిన ఆరోపణలు విచారణ దిశగా కొనసాగుతుంటే దేవేగౌడపై చేసిన వ్యాఖ్యలు హాసనలో గొడవలకు దారి తీశాయి. శరణేగౌడ తన తండ్రిని రాజీనామా చేయిస్తే రూ.10 కోట్లు తక్షణం ముట్టజెపుతామని, మొత్తం 10 మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేయించేందుకు స్పీకర్‌ నుంచి కూడా అడ్డంకి తొలగించుకునేలా యడ్యూరప్ప, శివనగౌడ నాయక్‌ సంభాషించటం చూస్తే రూ.కోట్లు రాజకీయాలనెలా నిర్దేశించాయో తెలుస్తోంది. గవర్నర్‌, ప్రధాని తదితరులు ఈ ఆపరేషన్‌ కమలకు సహకరిస్తారని కూడా యడ్యూరప్ప, శివనగౌడ నాయక్‌ వ్యాఖ్యానించారనేది ఇందులోని మరో కీలకాంశం.

audio 14022019

ముందు రూ.20 కోట్లు ఇస్తామని, నాగనగౌడను ముంబై వెళ్లి అధికారపార్టీకి చెందిన ఇతర ఎమ్మెల్యేలతో కలిసేలా, బీజేపీలో చేరేలా ఒప్పిస్తే మరో రూ.2.5 కోట్లు ఇస్తామని శరణగౌడతో నాయక్‌ అనడం ఇందులో వినిపించింది. కాగా.. ‘ఆపరేషన్‌ కమల్‌’ ఆడియో వివాదం హింసాత్మకంగా మారింది. హాసన్‌లో బుధవారం బీజేపీ, జేడీఎస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. హాసన్‌ ఎమ్మెల్యే ప్రీతంగౌడ ఇంటిపై జేడీఎస్‌ కార్యకర్తలు రాళ్ల వర్షం కురిపించారు. ఈ ఘటనలో కొందరు బీజేపీ కార్యకర్తలు గాయపడ్డారు. దాడికి పాల్పడ్డవారిపై చర్యలు తీసుకోకపోతే కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు ఫిర్యాదు చేస్తామని యడ్యూరప్ప చెప్పారు.

Advertisements