"అ" అంటే అమ్మ అని చిన్నప్పుడు చదువుకున్నాం. ఇకపై... "అ" అంటే అమరావతి, "ఆ" అంటే ఆంధ్రప్రదేశ్ అని స్థిరపడిపోవాలి. ఈ తరహా రాష్ట్రభక్తి రావాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో తొలి నిర్మాణమైన తాత్కాలిక సచివాలయానికి గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడి గ్రామ పరిధిలో బుధవారం ఉదయం 8-23కు చంద్రబాబు శంకుస్థాపన చేశారు. "ఈ ఏడాది జూన్ 15వ తేదీ నుంచి తాత్కాలిక సచివాలయమే పాలనా కేంద్రం. నేను ప్రతిరోజూ ఇక్కడికే వస్తా. నాలుగైదు గంటలు ఇక్కడే ఉంటా. ఈ నేలపై నుంచే పరిపాలన చేస్తా! రాజధాని నిర్మాణ పనులను కూడా రోజూ పర్యవేక్షిస్తా. ప్రపంచంలోని 10 ఉన్నతమైన రాజధానిలో ఒకటిగా అమరావతని నిర్మించి చేసి చూపుతాము." అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు. "ఈ నేలకు నమస్కారం. ఈ గాలికి నమస్కారం. ఈ ఊరికి, ప్రక్కన పారే కృష్ణమ్మకు మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నా. చరితార్థులైన రైతన్నలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా" అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన సీఎం... ఈ నేల తల్లి ఆశీర్వాదం కోరుకుంటున్నానంటూ ముగించారు.
శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్, డీప్యూటీ సీఎం చినరాజప్ప, శాసన మండలి చైర్మన్ చక్రపాణి, మంత్రులు పి.నారాయణ, ప్రత్తిపాటి పుల్లారావు, యనమల రామకృష్ణుడు, అచ్చెం నాయుడు, దేవినేని ఉమామహేశ్వరరావు, కె.శ్రీనివాస్, మాణిక్యాలరావు, పీతల సుజాత, పరిటాల సునీత, కొల్లు రవీంద్ర, డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ద ప్రసాద్, పలువురు శాసన సభ్యులు, ప్రభుత్వ వీప్లు, సీఆర్‌డీఏ కమీషనర్ శ్రీకాంత్, గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, భూములు ఇచ్చిన రైతులు, పెద్ద సంఖ్యలో అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Picture Source: Andhrajyothy