పవిత్ర కృష్ణవేణి, ఉత్తరవాహినిగా పేరుగాంచి తీరం వెంబడి వున్న పుణ్యక్షేత్రాలో అత్యంత ప్రసిద్దమైన పుణ్యక్షేత్రంగా భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న గుంటూరు జిల్లా అమరావతి మండలంలోని వైకుంఠపురం పుష్కరయాత్రికులకు స్వాగతం పలుకుతోంది.
పూర్వం ఈ పుణ్యక్షేత్రాన్ని రావూరు అని పిలిచేవారు. కృష్ణానదికి ఆనుకుని క్రౌంచాద్రి అనే పర్వతం వుంది. శ్రీమన్నారాయణుడు భక్తులను తరింపజేయడానికి ఆ కొండపై కొలువుండి అక్కడకు వచ్చే ఆవుల పాలు తాగుతూ కొన్నాళ్లకు గ్రామంలోని ఒక బ్రాహ్మణోత్తమునకు కలలో కనిపించి క్రౌంచాద్రిపై తాను ఒక గుహలో కొలువై ఉన్నానని, గుహకు దగ్గరలో రావిచెట్టు వుంది, దాని వద్ద నేలను తవ్వినట్లయితే ద్రవ్యం దొరుకుతుంది. ఆ ధనముతో తనకు ఆలయాన్ని నిర్మించాలని ఆజ్ఞాపించినట్లు చెబుతారు.
స్వామివారి ఆజ్ఞప్రకారం గుహవద్ద తవ్వగా అక్కడ ధనం లభించింది. దానితో స్వామివారి గుహ వద్ద నుంచి కొండ దిగువ భాగానికి కొండరాళ్లను పగులగొట్టించి దారిచేయునపుడు, స్వామి వారు కనిపించి నేను ఈ పర్వతమందు ఆవహించియున్నారని , శ్రీ వెంకటేశ్వర స్వామిగా అవతరించినట్లు సెలవిచ్చారట.
అంతట బ్రాహ్మణుడు ఆ గుహనందు చూడగా నిరాకార ఆకారంలోగల శ్రీ స్వామివారిని తిలకించి విగ్రహరూపంలో స్వామివారిని మలిచారని , అక్కడ శిల్పులు ఉలిపెట్టి కొట్టగా ఆ ప్రదేశం నుంచి రక్తం కారిందని చెబుతారు. అంతట స్వామివారు బ్రాహ్మణునితో నేను నిరాకార నిరంజనుడను , నాకు ఆకారంతో పనిలేదు, నా వక్షస్థలంపై గాయపరిచినారు. కావున నిత్యం గాయంపై గంధము వుంచమని ఆజ్ఞాపించాడట. ఆ నాటి నుంచి ఈ నాటి వరకు నిత్యం మంచి గంధం శ్రీ స్వామివారికి సమర్పిస్తున్నారు.
క్రౌంచాద్రి పర్వతం చుటూ 8 మంది ఆంజనేయులను ప్రతిష్టించి అష్టదిగ్గజము గావించారు. స్వామివారి సన్నిధిన ఉత్తరంగా కొండపైన కాలభైరవ క్షేత్రం వుంది. దీనికి దిగువన వున్న ఉత్తర వాహిని నందు గల పంచలింగములకు , స్వామివారికి దేవతలు , బుషులు , నిత్యం పూజలు జరుపుతారని ప్రతీతి. కృష్ణానది ఈ క్షేత్రం వద్ద ఉత్తరవాహినిగా పిలువబడుతోంది. ఈ క్షేత్రానికి మరోపేరు బంధవిరామ క్షేత్రం.
గోమాత నుంచి తన వృత్తాంతమును తెలుసుకుని పశ్చాత్తాపముతో పాప విముక్తి పొందుటకు ఈ వైకుంఠపురం పుణ్యక్షేత్రానికి వచ్చి ఉత్తరంగా ప్రవహించు కృష్ణవేణిలో స్నానమాచరించి వెంకటేశ్వరస్వామిని దర్శించి తీర్ధప్రసాదాలు స్వీకరించగా వారికున్న బంధము విడిపోయింది. అందువలన ఈ క్షేత్రాన్ని బంధవిరామ క్షేత్రంగా పిలుస్తారు. వారి విగ్రహాలు క్రౌంచాద్రి పర్వతంపై ఒక గుహలో వున్నాయి.
ఈ క్షేత్రం అమరావతి నుంచి 10 కిలోమీటర్ల దూరంలో విజయవాడ మార్గమధ్యంలో వుంది. ఈ క్షేత్రాన్ని దర్శించడానికి విజయవాడ నుంచి అమరావతికి ప్రతి అరగంటకు బస్సు సౌకర్యం కలదు.