పుష్కర విధులు నదిలో స్నానం చేస్తే మన పాపాలు పోతాయి. నదీ స్నానంతో పుణ్యం వస్తుంది. నీళ్ళతోనే అన్ని రోగాలు పోతాయనేది మన నమ్మకం. మన ఆత్మలన్నీ చివరకు పరమాత్మతో కలుస్తాయని చెప్పే పాఠమని ఈ నదీ ప్రవాహం. ఆత్మలన్నీ పరమాత్మలో కలవడమంటే మనం చేసే మంచి , చెడు పనులన్నీ చివరకు మనం ఉండే మన సమాజానికి ఉపయోగ పడటమే. నది మనకి తాగడానికి నీళ్లు ఇచ్చి, మంచి పంటల్ని పండించి జీవనాధారమై , మనందరి అవసరాల్ని తీరుస్తుంది.
ఇలాంటి నీళ్లని మనం దోసిళ్లలో తీసుకొని నీళ్ల స్వచ్ఛతని తెలుసుకుని ఎప్పటికి ఇలానే వుండేలా చూస్తామని ప్రతిజ్ఞ చేయడమే పుష్కర స్నానం. పిండ ప్రధానంలో మనం పితృదేవతల కోసం పూజ చేసి చివరికి బియ్యంతో ఉడికించిన పిండాల్ని నదీ నీళ్లలో వదుల్తాం. మన పితృదేవతలు మనల్ని వందేళ్లు ఆరోగ్యంగా ఉండమని దీవించాలని మనం కోరతాం. మనం రోగాలు లేకుండా ఆరోగ్యంగా వుండాలంటే పితృదేవతల రూపంలో నీళ్లలో వున్న చేపలు , తాబేళు , కప్పలకి పిండాల రూపంలో ఆహారాన్నిస్తాం.
నీళ్లలో పిండాల్ని వదలడమంటే మన పాపాల్ని అంటే రోగాల్ని పోగొట్టుకోవడానికి చేస్తే మంచి పని. మనం వదిలే పిండాలు నీళ్లలో వున్న చేపలు తినినీళ్లలోని మలినాల్ని, మురికిని తినేసి నీళ్లని శుభ్రంగా వుంచుతాయి. పుష్కరం పేరుతో మనం నీళ్లని మురికి చెయ్యకూడదు అనేదే పుష్కర సూత్రం. దైవ దర్శనం కోసం మనం గుడికి వెళ్తాం. గుడి అంటే ఒక శిఖరం , ఒక దేవుడి బొమ్మ కాదు.
గుడి, గుల్లో కొన్ని చెట్లు, గుడి దగ్గర్లో కోనేరు ఇవ్వన్నీ కలిస్తేనే దేవుడు , గుడి.ఇవన్నీ కలిస్తేనే పర్యావరణ సూత్రాన్ని, తత్వాన్ని చెప్తాయి. నీళ్లనిచ్చే చెరువుల్ని, బావుల్ని, కోనేరుల్ని కాపాడుకోవాలి. మంచి చెట్లు మన చుటూ వుండాలి. మందు మొక్కల్ని, వేప , ఉసిరి , రావి, మర్రి లాంటి చెట్లు ఉండేలా పెంచి కాపాడుకోవాలని మనకి చెప్తాయి మన దేవాలయాలు.