వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు పార్టీని రాజకీయంగా భారీగా నష్టపరుస్తున్నాయని వైసీపీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ముఖ్యంగా సీనియర్ నేతల విషయంలో అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి తీరు పార్టీని బలహీనపరిచే దిశగా తీసుకెళ్తోందని అంటున్నాయి. ‘జగన్ మొండిగా వెళుతున్నారు. రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడలు వేయడంలో అనుభవ రాహిత్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇలాగైతే రాజకీయంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది’ అని కొందరు విపక్ష ఎమ్మెల్యేలు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజా పద్దుల సంఘం (పీఏసీ) చైర్మన్ ఎన్నిక వ్యవహారం వైసీపిలో ముసలమే తెచ్చింది. చివరి వరకు శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూకే దక్కుతుందని అనుకున్న ఆ పదవిని జగన్ కర్నూలు జిల్లా డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి కట్టబెడుతూ నిర్ణయం తీసుకున్నారు.
ఇది భరించరాని అవమానమని నెహ్రూ, ఆయన సమీప బంధువు, ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ఆగ్రహంతో ఉన్నారు. మూడురోజుల సెలవుల అనంతరం శనివారం శాసనసభ సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి. కానీ నెహ్రూ, సుబ్బారావు సభకు రాలేదు. వారు.. నియోజకవర్గాలవారీగా కార్యకర్తలతో భేటీలు నిర్వహిస్తున్నారు. శనివారం నాడు కిర్లంపూడి, గోకవరంలలో కార్యకర్తలను జ్యోతుల కలిశారు. ‘మనకు అవమానం జరుగుతున్న చోట ఇంకా ఎందుకు ఉండడం? వైసీపీని వదిలేయండి’ అని పలువురు కార్యకర్తలు పట్టుబట్టారు.
కిర్లంపూడిలో నెహ్రూ అత్యున్నతంగా గౌరవించే దత్తుడు(సత్యనారాయణమూర్తి) కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ స్థాయిలో అవమానాలు జరుగుతుంటే ఇంకా పార్టీలో కొనసాగాల్సిన అవసరం ఏముందని జ్యోతులను ప్రశ్నించారు. కాగా.. శనివారం జ్యోతుల, సుబ్బారావు అసెంబ్లీకి రాకపోవడంతో వైసీపీ ఎమ్మెల్యేలు ఇదే అంశంపై మాట్లాడుకోవడం కనిపించింది. నెహ్రూ వర్గానికి చెందినవారని భావిస్తున్న రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి పత్రికల్లో వచ్చిన కథనాలపై జగనకు వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించారు. కానీ.. తర్వాత మాట్లాడదామని ఆయన అనడంతో.. ఆమె మిన్నకుండిపోయారు. జ్యోతుల వ్యవహారంపై వైసీపీ అధిష్ఠానం ఆలస్యంగా కళ్లుతెరిచింది. అవమాన భారంతో రగులుతున్న ఆయనతో పార్టీ నేతలు విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సజ్జల రామకృష్ణారెడ్డి రాయబారాలు నడిపారు. కాని ఆ రాయభారాలు ఏవి ఫలించలేదు. జ్యోతుల నెహ్రు మరియు ఆయన సన్నిహిత ఎమ్మేల్యేలు వైసిపి ని వీడటం ఖాయం గా కనిపిస్తుంది.
జగన్ తన మొండి వైఖరి మార్చుకోకపోతే పార్టీ కి తీవ్ర నష్టం వాటిల్లనుంది. ఇకనైన తన వైఖరి మార్చుకుంటే మంచిదని వైసిపి నాయకులూ హితవు పలికారు.