ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాజిటివ్ కేసులు పెరగటమే కాని, తగ్గటం అనేది లేకుండా పోతుంది. ఏ దశలోనో, కేసులు కంట్రోల్ అవ్వని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. నెల రోజుల క్రితం వరకు, కేవలం విదేశాల నుంచి వచ్చిన వారు, ఢిల్లీ నుంచి వచ్చిన వారు మాత్రమే ఉన్నారని, వారందరినీ ఇప్పటికే క్వారంటైన్ కు తరలించామని, మా వాలంటీర్ వ్యవస్థ ఈ విషయంలో అద్భుతం పని చేసిందని, చెప్పుకుంది ప్రభుత్వం. అయితే, నెల రోజులు తరువాత కూడా, కేసులు అత్యధికంగా పెరుగుతూ వెళ్తున్నాయి. గడిచిన 24 గంటల్లో, కేసులు సంఖ్య అనూహ్యంగా పెరిగిపోయింది. ఒక్క రోజులో అత్యధిక కేసులు వచ్చిన రోజుగా ఈ రోజు నిలిచిపోయింది. నిన్న ఉదయం నుంచి ఈ రోజు ఉదయం వరకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఒక్కసారిగా 80 కేసులు వచ్చాయి. దీంతో, మొత్తం కేసులు సంఖ్య 893కి చేరుకుంది. ఒక్క రోజులు అత్యధికంగా 80 కేసులు రావటం ఈ రోజే. ఏప్రిల్ 20న, 74 కేసులు వచ్చి, మొన్నటి దాక ఎక్కువ కేసులు వచ్చిన రోజుగా ఉంది. గతంలో, ఏప్రిల్ 1న 67 వచ్చాయి.
అయితే జిల్లాల వారీగా చూసుకుంటే, కర్నూల్ జిల్లాలో, అత్యధికంగా, 234 కేసులు వచ్చాయి. తరువాత స్థానంలో, 194 కేసులతో గుంటూరు జిల్లా ఉంది. గడిచిన 24 గంటల్లో కర్నూల్ జిల్లాలో 31 కేసులు వచ్చాయి. అలాగే గుంటూరు జిల్లాలో 18 కేసులు వచ్చాయి. ఇక చిత్తూరు జిల్లాలో 14 కేసులు నమోదు అయ్యాయి. ఏప్రిల్ 14కి ముందు, కేసులు తగ్గు ముఖం పట్టాయి అని ప్రభుత్వం చెప్తూ వచ్చింది. చివరకు ప్రధానితో కూడా జగన్ అదే చెప్పారు. రెడ్ జోన్ చాలా తక్కువ మండలాల్లో ఉన్నాయని, అక్కడ తప్ప అన్నీ ఎత్తేయాలని చెప్పారు. అయితే ఏప్రిల్ 14 తరువాత, కేంద్రం లాక్ డౌన్ పొడిగించిన తరువాత నుంచి, ఏపిలో కేసులు పెరుగుతూ వస్తున్నాయి. సగటున, 30 నుంచి 40 కేసులు రోజుకి వస్తున్నాయి.
ఇక ఇప్పటి వరకు 141 మంది డిశ్చార్జ్ అయితే, 27 మంది చనిపోయారు. నిన్న ఒకే రోజులో 56 కేసులు వస్తే, ఈ రోజు 80 కేసులు వచ్చాయి. వాలంటీర్ల ద్వారా, మూడు సార్లు సర్వే చేసామని, అందరినీ పట్టుకున్నాం అని చెప్పిన ప్రభుత్వం, ఇప్పుడు పెరుగుతున్న కేసులతో, మరో సర్వే కు వెళ్ళాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఇక్కడ మరొక విషయం కూడా ఆందోళన కలిగించే అంశం. దక్షిణ భారత దేశంలో, ఆంధ్రప్రదేశ్ లోనే మరణాలు ఎక్కువ. 27 మరణాలతో ఏపి నెంబర్ వన్ గా ఉంటే, తెలంగాణా 24 మరణాలతో తరువాత స్థానంలో ఉంది. ఇక రికవరీ రేటులో కూడా, ఆంధ్రప్రదేశ్ దక్షిణ భారత దేశంలో చివరి స్థానంలో ఉంది. ఏపికి 14.76 రికవరీ రేటు ఉండగా, అత్యధికంగా, కేరళాకు 70.32 శాతం రికవరీ రేటు ఉంది.