సీనియర్ IPS అధికారి ఏబీ వెంకటేశ్వరరావు రిటైర్మెంట్ కు ఇంకా కేవలం 4 రోజులే సమయం ఉండడం తో సర్వత్రా చర్చ సాగుతోంది. యూనిఫాంతో, పోస్టింగ్ లో ఉండి రిటైర్మెంట్ తీసుకోవాలన్న పట్టుదలతో పోరాడుతున్నారు ఏబి వెంకటేశ్వరరావు. అయితే ప్రభుత్వం ఇచ్చిన సస్పెన్షన్ ను రద్దు చేస్తూ ఈ నెల 8 న కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ (CAT) తీర్పు ఇచ్చింది. అయితే, CAT తీర్పు అనంతరం కూడా ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోంది.
CAT తీర్పును నిలుపుదల చేయాలంటూ హై కోర్ట్ కు వెళ్ళిన రాష్ట్ర ప్రభుత్వం, ఏబీ వెంకటేశ్వరరావు చివరి రోజు వరకు పోస్టింగ్ దక్కకుండా చూసే ప్రయత్నాల్లో ఉంది. సీఎం జగన్ రెడ్డి కుట్రలో భాగస్వామిగా మారిన ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం కోర్ట్ లో ఇరు వర్గాల వాదనలు పూర్తయ్యాయి. తీర్పు రిజర్వ్ చేసిన ద్విసభ్య ధర్మాసనం ఏబీ వెంకటేశ్వరరావు భవిష్యత్తు గురించి తక్షణ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఏబీ వెంకటేశ్వరరావు రిటైర్మెంట్ కు ఇంకా కేవలం 4 రోజులే గడువు ఉండడంతో కోర్ట్ తీర్పు, ప్రభుత్వ తదుపరి చర్యలపై అన్ని వర్గాల్లో చర్చ, ఉత్కంఠ నెలకొంది. జగన్ ప్రమాణ స్వీకారం చేసిన 2019 మే 30 నుంచి వెంకటేశ్వరరావు కు పోస్టింగ్ ఇవ్వని వైసీపీ ప్రభుత్వం, అదే రోజు ఇచ్చిన రెండో జీవో లోనే వెంకటేశ్వరరావు పోస్టింగ్ తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం ఆయనపై కేసులు పెట్టి రెండు సార్లు సస్పెన్షన్ విధించారు.
గత 5 ఏళ్లుగా కేసుల పై, ఉద్యోగం కోసం ఎడతెగని పోరాటం చేస్తున్న వెంకటేశ్వరరావు, ప్రభుత్వంతో, వ్యవస్థలతో ఒంటరిగా పోరాటం చేస్తూ పేరు తెచ్చుకున్నారు. ఆయనకు పోస్టింగ్ పై పౌర సమాజం నుంచి భారీ మద్దతు లభిస్తోంది. ఏబీ వెంకటేశ్వరరావు చివరి నిమిషం వరకు పోరాడుతూ, తన యూనిఫాంతోనే రిటైర్డ్ అవ్వాలని పట్టుదలతో ఉన్నారు. ఈ నెల 31 తరువాత ఆయన రిటైర్మెంట్ తీసుకోవాల్సి ఉండగా, CAT తీర్పు అమలు చేయడం ద్వారా పోస్టింగ్ ఇవ్వడం జరిగేనా లేదా అన్నదే ఇప్పుడు అందరిలో ఉత్కంఠ.