కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ నగరంలో రోజు రోజుకు పెరుగుతున్న కరోనాను కట్టడి చేసేందుకు ప్రజలు లాక్ డౌన్ ను గౌరవిస్తూ భౌతిక దూరం పాటిస్తేనే నియంత్రించగలమని జల్లా కలెక్టర్ ఏ.ఎండి.ఇంతియాజ్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. శనివారం కృష్ణలంకకు చెందిన ఒక ట్రక్కు డ్రైవర్ బోర్ కొడుతుందని, టైంపాస్ కావడం లేదని ఇరుగు పొరుగు వారందరినీ పిలచి పేకాట ఆడాడని కలెక్టర్ చెప్పారు. అలాగే పిల్లలు, ఆడవాళ్లు, హౌసీ నిర్వహించారని వీటితో సంబంధిత ప్రజలు భౌతిక దూరాన్ని ఉల్లంఘించడం ద్వారా ఒక్కరి వల్ల సుమారు 24 మందికి కరోనా సోకి పాజిటివ్ కేసులు నమోదైయ్యాయని కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే కార్మికనగర్ కు చెందిన మరో ట్రక్కు డ్రైవర్ కుటుంబ సభ్యులతో, ఇరుగుపొరుగువారితో కలిశాడని ఆయనతో సుమారు 15 కేసులు కార్మికనగర్ లో వచ్చాయని కలెక్టర్ బాధ పడ్డారు.
ఇందులో అధికార యంత్రాంగం గుర్తిస్తున్నదేమిటంటే సామాజిక దూరం, భౌతిక దూరం పాటించడం లేదని కలెక్టర్ చెప్పారు. దాదాపు 40 పాజిటివ్ కేసులు ఈ రెండు సంఘటనల ద్వారా రావడంపై కలెక్టర్ ఆవేదన వ్యక్తం చెప్పారు. సమాజంలో కరోనా ప్రబలుతుందన్న కారణంతో లాక్ డౌన్ పెట్టామని దానిని గౌరవించాల్సిన బాధ్యత సమాజంలోని ప్రతి వ్యక్తి పై ఉందన్నారు. పోలీసు, వైద్యులు, పారిశుద్ధ్య సిబ్బంది రెవెన్యూ ఎన్నిశాఖలు నియంత్రించడానికి ప్రయత్నించినా భౌతికదూరమే ప్రామాణికంగా నిలుస్తుందన్నారు. కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు ఈ క్లిష్ట సమయంలో ప్రతి ఒక్కరూ దయచేసి ఇంటి నుండి బయటకు రావద్దని ఎవ్వరినీ కలవద్దని, భౌతిక దూరం పాటించాలని కలెక్టర్ ఇంతియాజ్ ప్రజలను వేడుకున్నారు.
ఇక మరో పక్క, రేపు ఆదివారం కావటంతో, మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటుంది విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్. ఈ విషయం పై మరొక ప్రకటన చేసారు, వీఎంసీ కమిషనర్ వెంకటేశ్. కరోనా ఎక్కువగా ఉన్న నేపధ్యంలో, రేపు విజయవాడలో నాన్ వెజ్ బంద్ చేస్తున్నట్టు చెప్పారు. మటన్ కాని, చికెన్ కాని, ఫిష్ మార్కెట్ కాని ఉండవని చెప్పారు. అలాగే విజయవాడలో ఉన్న కబేళా మూసివేస్తున్నాం అని, చేపల మార్కెట్ కూడా మూసేస్తున్నాం అని వీఎంసీ కమిషనర్ వెంకటేశ్ చెప్పారు. విజయవాడలో పరిస్థితి పై, గత వారం పది రోజులుగా, జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉంది.