దక్షిణ భారత శక్తి పీఠమైన శ్రీశైలం మల్లన్న సన్నిధిలో అంతులేని అక్రమాల భాగోతం భక్తుల మనోభావాలను దెబ్బ తీస్తోంది. ఎంతో భక్తిశ్రద్ధలతో ప్రతి ఏటా లక్షలాదిగా ప్రజలు శ్రీశైల పుణ్యక్షేత్రాన్ని సందర్శించి చెల్లించు కుంటున్న ముడుపుల సొమ్మును కొందరు స్వాహా చేస్తూ ఆలయ పవిత్రతను అప్రతిష్ట పాలు చేస్తు న్నారు. దర్శన, ఆర్జిత, అభిషేక, మహామంగళారతి టికెట్ కౌంటర్లలో చోటు చేసుకున్న భారీ కుంభకోణం ఇప్పుడు దుమారం రేపుతోంది. కౌంటర్ కేంద్రాల్లో కాంట్రాక్టు పద్దతిన వనిచేస్తున్న సిబ్బంది ఈ అక్రమ భాగోతానికి పాల్పడినట్లు ఆలయ అధికారులు గుర్తించి పోలీస్ ఫిర్యాదు చేయడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఆర్జిత,దర్శన టికెట్ కౌంటర్ల సిబ్బంది అంతర్జాల మాయ చేసినట్లు తెలుస్తోంది. రూ.150ల దర్శన టికెట్స్ జారీ ప్రక్రియ మొత్తం అన్లైన్ ద్వార జరు గుతోంది. ఈ వ్యవహారం అంతా ఆంధ్రబ్యాంక్, ఎస్బీఐ లకు పాలక మండలి అప్ప జెప్పారు. ఈ బ్యాంకుల పర్యవేక్షణలో ఈ కౌంటర్ల వ్యవహారం నడుస్తోంది. సాఫ్ట్వేర్ నైపుణ్యం కలిగిన ఇద్దరిని ఈ వింగ్ లో సిస్టం అడ్మినిస్ట్రేటర్స్ గా కూడ ఏర్పాటు చేశారు.
ఇక్కడే అవినీతికి బీజం పోశారు. నైపుణ్యానికి మరింత పదును పెట్టి సాఫ్ట్ వేరు అచ్చం పోలిన మరో సాఫ్ట్ వేరు క్రియేట్ చేశారు. డైలీ విక్రయాలు నిర్వహించే టికెట్స్ లో కొన్ని క్రియేట్ చేసుకన్న సాఫ్ట్వేర్ ద్వారా అమ్ముకొని సొమ్మును దారి మళ్లిచారు. గతంలో కొందరు ఈఓ లు ఎప్పటికప్పుడు ఆడిట్ నిర్వహించకపోవడం కూడ అక్రమాలకు అడ్డులేకుండా చేసింది. కరోనాతో ఆలయ సిబ్బందికి కొంత విరామం ఏర్పడి కంప్యూటర్ కార్యకలాపాల పై దృష్టి సారించడంతో ఈ కుంభకోణం వెలుగు చూసింది. అంతర్జాల మాయ పై సమగ్ర దర్యాప్తుకు ఎఇఒ స్థాయి అధికారిని నియమించి ఫిర్యాదు కూడ చేశారు. టికెట్స్ అమ్మకాల్లో జరిగిన అక్రమ లెక్కలు దాదావు కోటిన్నర ఉన్నట్లు తేల్చారు. మరింత లోతుగా దర్యాప్తు జరిగితే ఇంకొంత అవినీతి బట బయలయ్యే అవకాశం ఉంది. ఆయా టికెట్ కౌంటర్లలో పనిచేస్తున్న సిబ్బంది ఒకరి పై ఒకరు ఫిర్యాదు చేసుకోవడంతో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి.
2017 నుండి ఆలయంలో ఆయా వింగ్లో అవినీతి బయట పడుతూనే వస్తోంది. శ్రీశైల క్షేత్రంలో అవినీతి ఆక్రమాలు తవ్వేకొద్ది బయటపడే అవకాశం ఉంది. గతంలో పెట్రోల్, విరాళాలు ఇప్పుడు ఆర్జిత, అభిషేక టికెట్స్ ఇలా ఒక్కొక్కటిగా వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఆడిట్ క్రమబద్ధంగా చేపట్టి దర్యాప్తు నిష్పక్షపాతంగా జరిగితే టోల్‌గేట్, లడ్డు కౌంటర్, రెవెన్యూ విభాగం ఇలా అన్ని వింగ్ లో మరిన్ని అక్రమాలు బయట పడవచ్చని తెలుస్తుంది. స్వామి సొమ్ము స్వాహా భాగోతానికి సంబంధించి ఐటీ చట్టం కింద పోలీసులు కేసులు కట్టి విచారణ చేస్తున్నారు. శ్రీశైల శైవ క్షేత్రంలో చోటుచేసుకున్న అవినీతి ఆక్ర మాలపై సమగ్ర దర్యాప్తుకు దేవాదాయశాఖ ఆదేశించింది.