వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో దేవాదాయ భూములకు ఎసరు పెట్టి హిందూమతాన్ని పరోక్షంగా అణిచివేసే ప్రయత్నాలు చేస్తుందని భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. మంగళవారం కన్నా నివాసంలో టిటిడి భూముల వేలాన్ని వ్యతిరేకిస్తూ, హిందూ దేవాలయాల ఆస్తుల పరిరక్షణకై ఉపవాసదీక్ష జరిగింది. కార్యక్రమానికి బిజెపి శ్రేణులతో పాటు జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ రాష్ట్రంలో హిందూ ధర్మానికి, మతానికి ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. హిందూ దేవాలయాల జోలికి రావద్దని ప్రభుత్వానికి పలుమార్లు చెప్పినా ప్రభుత్వం పెడచెవిన పెడుతుందని అన్నారు. రాష్ట్రంలో మతమార్పిడిలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం దేవాలయ భూములను కొల్లగొట్టేందుకు కుట్రలు పన్నుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నామొన్నటి వరకు మంగళగిరి, అన్నవరం దేవాలయ భూములను లాక్కునే ప్రయత్నం చేసిన ప్రభుత్వం నేడు ఏకంగా తిరుమల వెంకన్న భూములకు ఎసరు పెట్టిందన్నారు.

టిటిడి ఆస్తులను వేలం వేయాలన్న టిటిడి బోర్డు నిర్ణయాన్ని హిందూధార్మిక సంస్థలు, బాలాజి భక్తులు తీవ్రంగా ఖండిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో దేవాలయాలకు చెందిన భూముల్లో ప్రభుత్వం ఒక గజం అమ్మినా తాము పోరాటానికి సిద్ధమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రజల నుండి వస్తున్న విమర్శలను గుర్చించి ప్రభుత్వం టిటిడి ఆస్తుల వేలాన్ని తాత్కాలికంగా రద్దు చేసిందన్నారు. ప్రస్తుతం టిటిడి ఛైర్మన్‌గా ఉన్న వై.వి.సుబ్బారెడ్డి ప్రతపక్షంలో ఉన్న సమయంలో ఆలయ భూముల రక్షణకు సంబంధించి చాలా మాట్లాడారని నేడు ఆయన స్వయంగా టిటిడి భూముల వేలానికి ఆమోదం తెలిపేలా వూనుకున్నారన్నారు. ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టేందుకు ఆగమేగాలపై 888జీవోను తీసుకొచ్చిందన్నారు. ఆ జీవోలో కేవలం టిటిడి ఆస్తుల వేలాన్ని తాత్కాళికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించిందే తప్పా శాశ్వతంగా టిటిడి ఆస్తుల జోలికి వెళ్ళమని జీవోలో పేర్కొలేదని చెప్పారు. జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత చేసిన ప్రతీ పని ప్రజలను మోసం చేసేవిధంగా ఉందన్నారు.

ప్రభుత్వ కార్యకలాపాలకు దేవాదాయ భూములు వాడుకుంటారా అని ప్రశ్నించారు. కరోనాను అడ్డుపెట్టుకొని సింహాచలం దేవస్థానానికి చెందిన విలువైన భూములను వైసీపీ పెద్దల అండదండలతో వారి అనుచరులు ఆక్రమించుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోదా అని ప్రశ్నించారు. ఆలయ భూముల్లో అక్రమ కట్టడాలు కడుతున్నా ప్రభుత్వానికి కనపడదా అని ప్రశ్నించారు. అక్రమార్కులపై చర్యలు తీసుకొని సింహాచలం భూములను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు చెప్పారు. తెలుగుదేశంపార్టీ హయాంలో ఆస్తుల విక్రయ ప్రక్రియ ప్రారంభమైనట్లు చెబుతున్న వైకాపా నేతలు పోలవరం ప్రాజక్టు సహా గత ప్రభుత్వ నిర్ణయాలను రివర్స్ టెండరింగ్ పేరిట ఎందుకు రద్దుచేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. దేవాలయ ఆస్తులకు సంబంధించి తాను సిఎంకు ఇప్పటికే లేఖ రాశానని, మంత్రులు దమ్ముంటే వాటికి నేరుగా సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. జీవో నెంబర్ 39పై ప్రభుత్వం స్పష్టతనిచ్చి తన పారదర్శకతను నిరూపించుకోవాలని అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read