విశాఖపట్నంలోని, నర్సీపట్నంలో నిజాయతీగా పని చేసి పేరు తెచ్చుకున్న దళిత డాక్టర్ సుధాకర్, కరోనా బాధితులకు చికిత్స చేసేందుకు వైద్య సిబ్బందికి సరిపడా యన్-95 మాస్కులు, పి.పి.ఇ.లు లేవని అనటంతో, ఆయన్ను ప్రభుత్వం సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తరువాత డా.సుధాకర్ ని సస్పెండ్ చేయటం, ఆయన కుమారుడు నిబంధనలు ఉల్లంఘించాడని కేసులు పెట్టటం, ఇప్పుడాయన్ని చావబాది అరెస్ట్ చేయటం చూసాం. డా.సుధాకర్ ను నడిరోడ్డుపై చొక్కా విప్పి పెడరెక్కలు వెనక్కి విరిచి, కట్టి లాఠీలతో కొడుతూ అరెస్ట్ చేసారు. అయితే నిన్న సాయంత్రం ఆయన తాగి ఉన్నాడని చెప్పిన పోలీసులు, నిన్న రాత్రి ఆయనకు మెంటల్ కండిషన్ సరిగ్గా లేదని చెప్పారు. దీంతో ఆయన్ను మెంటల్ హాస్పిటల్ లో చేర్పించారు. అయితే, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎవరికైనా ఇదే గతి అనే కాదు, ఈ ఘటన దళితుల పట్ల వైకాపా ప్రభుత్వాని కున్న చులకన భావానికి నిదర్శనమంటు, దళిత నేతలు ఆందోళన చేస్తున్నారు.
అయితే ఈ విషయం పై, వైసీపీ కీలక నాయకుడు, విజయసాయి రెడ్డి స్పందించారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన, నిన్న డాక్తర సుధాకర్ ఘటన మొత్తం, చంద్రబాబు స్క్రిప్ట్ అంటూ, ఒక్క ముక్కలో తీసి పడేసారు. సుధాకర్ ఘటనకు చంద్రబాబు కారణం అని, ఎప్పుడూ చెప్పినట్టే చెప్పారు. గతంలో కూడా ఏ వ్యతిరేక సంఘటన జరిగినా, వారికి కులం అంటగట్టటం, వారికి తెలుగుదేశం పార్టీ రంగు పులమటం చేస్తూ ఉన్నట్టే, ఈ సారి కూడా, చంద్రబాబు మీద తోసేసారు విజయసాయి రెడ్డి. ఆయన ట్వీట్ ఇది. "బాబు వాడకం ఎలా ఉంటుందంటే జీవితకాలంలో వాళ్లు చదివిన చదువు, సంపాదించుకున్న గుర్తింపు అంతా గంగలో కలిసిపోతుంది. ఎల్లోవైరస్ ప్రభావంతో వైజాగ్ లో మత్తు డాక్టర్ చేసిన వీరంగం చూస్తే అర్థం కావడం లేదా నెక్స్ట్ ఎవరని! అయ్యో అంత అన్యాయం జరిగిందా అని ఒక ప్రెస్ నోటు రిలీజవుతుంది."
అయితే ఈ ఘటన పై తెలుగుదేశం పార్టీ, మాజీ మంత్రి వర్యులు పీతల సుజాత స్పందించారు. "విశాఖపట్నంలో దళిత డాక్టర్ సుధాకర్ పై జరిగిన దాడికి, ఆయన ఆరోగ్య స్థితికి జగన్మోహన్ రెడ్డి నైతిక బాధ్యత వహించాలి. దాడి చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ చట్టం ప్రకారం కేసులు పెట్టాలి. డాక్టర్ సుధాకర్ సస్పెన్షన్ ను వెంటనే రద్దు చేయాలి. డాక్టర్ సుధాకర్ పై ఆరోగ్య పరిస్థితిపై వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దళిత డాక్టర్ పై దాడి చేయడం, దళితుల నుండి వేలాది ఎకరాల అసైన్డ్ భూములు లాక్కోవడం, దళిత నియోజకవర్గంలో ఉన్న రాజధానిని నాశనం చేయడమేనా వైసీపీ దళితులకు చేస్తున్న మేలు.? నాడు ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల్ని వైఎస్ఆర్ ఇడుపులపాయకు, హైదరాబాద్ రింగ్ రోడ్డుకు మళ్లించాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల్ని నవరత్నాలకు మళ్లిస్తున్నారు. ఇదేనా దళితులకు చేస్తున్న మేలు.? వేలాది దళిత కుటుంబాలు వైసీపీ నేతల దాడులకు, దౌర్జన్యాలకు భయపడి ఎక్కడెక్కడో తలదాచుకునే పరిస్థితి కల్పించడమేనా దళితుల సంక్షేమం.? గత ప్రభుత్వ హయాంలో దళితులకు అందే ప్రతి సంక్షేమ పథకాన్ని నిలిపివేయడమేనా దళితుల పట్ల జగన్మోహన్ రెడ్డి ప్రేమ.? ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి దళిత వ్యతిరేక చర్యలను విడనాడాలి. లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని గుర్తుంచుకోవాలి." అని అన్నారు.