దేశవిదేశాల్లో వున్న కోట్లాది మంది భక్తులకు కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం కల్పించే విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఒక స్పష్టతకు రాలేక పోతోంది. మే 17వరకు మూడవ విడత లాక్ డౌన్ అమలులో వున్న నేపధ్యంలో కేంద్రం సడలింపులిస్తే ఏడుకొండల వేంకన్న ఆలయంలోనికి భక్తులను అనుమతించే విషయంలో టిటిడికీ ఒక మార్గం సుగమమవుతుందా అనేది అటు టిటిడి అధికారుల్లో ఇటు శ్రీవారి భక్తుల్లో వీడని సందిగతగా మారింది. ఇప్పుటికిప్పుడు దేశంలో, ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ తీవ్రతను అంచనావేయలేక పోతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ నిర్ణయం తీసుకోనున్నారనేది సర్వత్రా చర్చనీయాంశం గామారింది. కరోనా వైరస్ ప్రపంచాన్ని భయపెడుతున్న తరుణంలో మన దేశంలోనూ కరోనా వ్యాప్తితో కట్టడికి దశల వారీగా కేంద్రం లాక్ డౌన్ ఆంక్షలు అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే గత మార్చినెల 22 నుంచి ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలకు భక్తుల రాకను నిషేధించారు.

పూర్తిగా భక్తులను ఏడుకొండలపైకి అనుమతించకపోవడంతో 50 రోజులుగా తిరుమలేశుని దర్శనం దూరమైంది. చాలామంది భక్తులు శ్రీవారిని చూడలేకపోతున్నామనే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే కరోనా వైరస్ పూర్తిగా కట్టడి చేసే వరకు ఆలయాలను మళ్లీ తెరుస్తారా? లేదా అనేది మాత్రం భక్తులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా, తెలుగురాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ లో నిత్యావసర వస్తువుల దుకాణాల తెరిచివుంచే సమయంలో మార్పులు చేశారు. ఉదయం 7 గంటలనుంచి సాయంత్రం 5 గంటల వరకు చాలావరకు దుకాణాలను తెరిచి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. మద్యం దుకాణాలను తెరిచి విక్రయాలు ప్రారంభించారు. ఈ నేపధ్యంలో ఈనెల 17వతేదీ లాక్ డౌన్ ముగింపు గడువు వుండటంతో ఆరోజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది రాష్ట్ర ప్రజల్లో ఉత్కంఠగా మారింది. ఇంతకీ తిరుమల శ్రీవారి ఆలయంలోనికి భక్తులను అనుమతినిస్తారా? లేదా అనేది కూడా అనుమానమే. ఆంక్షలతో నిబంధనలు కఠినంగా అమలవుతుండటంతో కరోనా కట్టడిచేయగలిగారనేది అధికార వర్గాల్లో వినిపిస్తున్న వ్యాఖ్యలు.

రేపు లాక్ డౌన్ ముగియనుండటంతో ఒకవేళ ఆలయాలకు సడలింపునిస్తే భక్తులను గతంలోలాగా ఆలయాల్లోనికి అనుమతించరనేది స్పష్టమవుతోంది. దీంతో తిరుమలకు రోజువారీగా 90 వేలమంది వరకు భక్తులు వచ్చి ఇష్టదైవాన్ని దర్శించుకునేవారు. గత మార్చి 22 వరకు గంటకు 4 వేలమంది భక్తులను ఆలయంలోనికి అనుమతించి శ్రీవారి దర్శనం కల్పించేవారు. ఇప్పుడు రోజువారీలో 5వేల నుంచి 10 వేలమంది లోపే మాత్రమే భక్తులను అనుమతించే యోచనలో టిటిడి వర్గాలు కసరత్తు చేస్తున్నాయి. అంతేగాక లాక్ డౌన్ సడలింపులిస్తే తిరుమలలో ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించి తదుపరి దర్శనానికి భక్తులను అనుమతించే విషయంపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం వుందని తెలుస్తోంది. ఒకవేళ కేంద్రం ఆలయాలు తెరిచి భక్తులకు దర్శనం కల్పించే విషయంలో సడలింపునిచ్చినా తిరుమలలో తొలుత టిటిడి ఉద్యోగులు, తిరుమల, తిరువతి స్థానికులను భౌతిక దూరం పాటిస్తూ అనుమతించేలా కూడా యోచిస్తున్నారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్ లోనికి అనుమతించకుండా క్యూలైన్లలోనే నేరుగా అనుమతించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారనేది సమాచారం. రాష్ట్రంలో ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో కరోనా ప్రభావ పరిస్థితులు గమనిస్తుంటే ఏడుకొండల వెంకన్న దర్శన భాగ్యం భక్తులకు కలుగుతుందా లేదా అనేది అటు టిటిడి వర్గాల్లో ఇటు భక్తుల్లో వీడని సందిగ్ధతగా మారింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read