విశాఖపట్నంలోని ఆర్ఆర్ వెంకటాపురంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్‌లో జరిగిన ప్రమాదంలో, 12 మంది చనిపోయిన విషయం తెలిసిందే. కంపెనీలో స్టరైన్ గ్యాస్ లీక్ కావటంతో, వందలాది మంది ఆ విష వాయువులు పీల్చి, స్పృహ తప్పి పడిపోయిన విషయం తెలిసిందే. దాదాపుగా 5 నుంచి 8 గ్రామాల ప్రజలు, ఈ గ్యాస్ బాధితుల లిస్టు లో ఉన్నారు. వీరిలో 12 మంది చనిపోగా, చాలా మంది చికిత్స తీసుకుని ఇంటికి వెళ్ళగా, ఇంకా కొంత మంది చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఈ మొత్తం ఘటన పై, ఎల్జీ పాలిమర్స్ సంస్థ పై అనేక అనుమానాలు నేలకోనటంతో, కేంద్రం సీరియస్ అవ్వటం, అటు హైకోర్ట్ ఈ విషయం సుమోటోగా తీసుకోవటం, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సుమోటోగా తీసుకోవటం జరిగిపోయాయి. అలాగే మానవ హక్కుల సంఘం, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, కేంద్ర ప్రభుత్వం కూడా జరిగిన ఘటన పై ఎంక్వయిరీకి ఆదేశించింది. మరో పక్క, రాష్ట్ర ప్రభుత్వం కూడా తన పరిధిలో కొంత మందితో ఎంక్వయిరీ వేసింది.
ఇప్పటికే కొంత మంది విచారణ కూడా ప్రరంభించారు. ముఖ్యంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, ఘటన జరిగిన మూడో రోజే, ఎల్జీ పాలిమర్స్ కు షాక్ ఇచ్చింది. ముందు 50 కోట్లు మధ్యంతర పరిహారం కాట్టాలి అంటూ, ఎల్జీ పాలిమర్స్ ను ఆదేశించింది. అయితే ఎల్జీ పాలిమర్స్ ఏమి అనుకుందో ఏమో కాని, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, ఈ కేసుని సుమోటోగా తీసుకుని, విచారణ జరిపే హక్కు లేదు అని,దని పై స్టే ఇవ్వాలి అంటూ, సుప్రీం కోర్ట్ లో పిటీషన్ వేసింది. అయితే దీని పై స్పందించిన సుప్రీం కోర్ట్, ఈ విషయం మీరు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో తేల్చుకోండి, మేము ఇప్పటికిప్పుడు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేం అని తేల్చి చెప్పింది. జూన్ 1న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో వాదనలు ఉన్నాయి, కాబట్టి అక్కడే తేల్చుకోవాలని సూచించింది.
గ్రీన్ ట్రిబ్యునల్ లోనే, మీకు విచారణ అధికారం లేదని చెప్పండి, అంటూ, ఈ కేసుని జూన్ 8కి వాయిదా వేసింది సుప్రీం కోర్ట్. తమ పై, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, రాష్ట్ర హైకోర్ట్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఇలా మొత్తంగా 7 విచారణ కమిటీలు వేసారని, మే 7న ఘటన జరిగితే, మే 8నే తమ పై విచారణ కమిటీలు వేసారని, ఎల్జీ పాలిమర్స్ సుప్రీం కోర్ట్ కు తెలిపింది. అయితే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పై మాత్రమే, ఎల్జీ పాలిమర్స్ అభ్యంతరం చెప్తూ, సుప్రీం కోర్ట్ కు వెళ్ళటం పై, ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఒక వేళ ఏ తప్పు లేకపోతే, విచారణ ధైర్యంగా ఎదుర్కోవాలి కాని, ఇలా వారికి విచారణ అధికారం లేదు, వారు సుమోటోగా తీసుకోకూడదు అని సాకులు చెప్పటం ఎందుకు ?