విశాఖపట్నంలో ఎల్జీ పలైమర్స్ ఘటన మర్చిపోక ముందే, మరోసారి, విశాఖ వాసులను దట్టమైన పొగ భయపెట్టింది. ఈ రోజు విశాఖపట్నంలో ఉన్న హెచ్‌పీసీఎల్ రిఫైనరీలో సీడీయూ-3 యూనిట్ ను ఈ రోజు తెరిచేందుకు, హెచ్‌పీసీఎల్ చర్యలు తీసుకుంటూ ఉండగా, ఒక్కసారిగా తెల్లని పొగలాగా వచ్చి, ఆ ప్రాంతం మొత్తం అలుముకున్నాయి. దీంతో ఏమి జరుగుతుందో తెలియని ప్రజలు, ఒక్కసారిగా భయాందోళనకు గురి అయ్యారు. కొంత మంది, ఇళ్ళ నుంచి బయటకు వచ్చి, భయంతో గడిపారు. అయితే, అదేమీ ప్రమాదం కాకపోవటం, కొద్ది సేపటికి ఆ పొగ తగ్గిపోవటంతో, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే జరిగిన ఘటన పై ఇంకా అధికారిక సమాచారం రాలేదు. ఆ పొగ ఎందుకు వచ్చింది, అది ఏమిటి అనే దాని పై క్లారిటీ రావాల్సి ఉంది.
అయితే ఇళ్ళ నుంచి ఈ పొగ స్పష్టంగా కనపడటంతో, కొంత సేపు స్థానికులకు ఏమి జరుగుతుందో అర్ధం కాలేదు. ఇప్పటికే ఎల్జీ పాలిమర్స్ విషయంలో భయం భయంగా ఉన్న విశాఖ ప్రజలు, ఈ ఘటన చోటు చేసుకోవటంతో, జరిగిన ఘటన పై, ఒకరిని ఒకరు ఫోన్ చేసుకుని, జరిగిన ఘటన పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే క్రమంగా పొగ ఆగిపోవటంతో, ప్రజలు ఆ భయం నుంచి బయటకు వచ్చారు. అయితే, తెలుస్తున్న సమాచారం ప్రకారం, కొన్ని రోజుల నుంచి కంపెనీ మూసేసి ఉండటంతో, ఈ రోజు మొదలు పెట్టటంతో, సహజంగా రియాక్షన్స్ వల్ల ఇలా జరిగి ఉండవచ్చని, అది ప్రమాదకర వాయువు కాదని తెలుస్తుంది. హెచ్‌పీసీఎల్ దీని పై స్పష్టమైన ప్రకటన చేసిన తరువాత కాని, జరిగింది ఏమిటో క్లారిటీ వచ్చే అవకాసం లేదు.