రాష్ట్రంలో ఎన్నికల అధికారి తొలగింపు విషయంలో ఒక్కపక్క వివాదం కొనసాగుతుండగా మరోపక్క హైకోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరుగుతుండగా అనుమతి లేకుండా 30 మంది న్యాయవాదులు వీడియోలో చొచ్చుకురావడం మరో సమస్యగా మారింది. ఈ అంశంపై హైకోర్టు సీరియస్ గా తీసుకుంది, పాస్వర్డ్ ఎవరికి ఇస్తారో వారు మాత్రమే వీడియో కాన్ఫరెన్స్ కు రావాల్సి ఉంటుంది. నిమ్మగడ్డ రమేష్ ను ఎన్నికల అధికారిగా తొలగించిన విషయంపై గత రెండు రోజులుగా హైకోర్టులో విచారణ జరగుతోంది. లాక్ డౌన్ అమలులో ఉండటంలో సిజె ఆధ్వర్యంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ కొనసాగుతోంది. ఇందులో భాగంగా బుధవారం ఉదయం వాదనలు ప్రారంభమయ్యాయి. . ఇప్పటి వరకు ఆరుగురు పిటిషనర్ల తరపున న్యాయవాదులు తమ వాదనను వివరించారు. ప్రముఖ న్యాయవాది వేదుల వెంకటరమణ తన వాదనలు ప్రారంభించారు.

అయితే ఈ సమయంలో అనూహ్యగా అనుమతించిన వారు కాకుండా సుమారు 30 మంది న్యాయవాదులు వీడియో కాన్ఫరెన్స్ లోకి చొచ్చుకువచ్చారు. ఒకేసారి స్క్రీన్ పై ఎక్కువ మంది న్యాయవాదులు రావడంతో అందరూ అవాక్కయ్యారు. ఈ అంశంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంతో సీక్రెట్ గా ఉండాల్సిన పాస్వర్డ్ ఇతరులకు ఎలా చేరిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీరియస్ గా వాదనలు జరుగుతున్న తరుణంలో క్రాస్ టాక్ రావడం సరికాదని ఆయన అన్నారు. దీనితో విచారణను సోమవారానికి వాయిదా వేశారు. ఈ కేసును ప్రత్యేకంగా తీసుకుని నేరుగా కోర్టులోనే విచారిస్తామని హైకోర్టు ప్రకటించింది. ఈ కేసులో పిటిషన్లు దాఖలు చేసిన న్యాయవాదులకు లాక్ డౌన్ నుంచి మినహాయిస్తూ పాసులు జారీ చేయాలని డిజిపికి ఆదేశాలు జారీ చేశారు. కొంతమంది న్యాయవాదులు హైదరాబాద్ నుంచి రావల్సి ఉండటంతో ఈ విషయంలో డిజిపితో సంప్రదించనున్నట్లు సిజె తెలిపారు.

సోమవారం అందరూ సామాజిక దూరం పాటించి విచారణకు హాజరుకావాలని ఆయన కోరారు. ఎన్నికల అధికారిగా విధుల నుంచి తొలగించడాన్ని సవాల్ చేస్తూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పిటిషన్ దాఖలు చేశారు. మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్లో పాటు ఆరుగురు ప్రజావాణ్యం పిటిషన్లను దాఖలు చేశారు. ఈ పిటిషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం, ప్రస్తుత ఎన్నికల కార్యాలయం కౌంటర్లు దాఖలు చేశాయి. మొత్తం వది మంది ఈ పిటిషన్లో వాదనలు వినిపించాల్సి ఉంటుంది. అయితే విచారణ సోమవారానికి వాయిదా పడటంతో, అప్పటి వరకు కొత్త ఎలక్షన్ కమీషనర్ ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా చూడాలని, ఆదేశాలు ఇవ్వాలని, రమేష్ కుమార్ తరుపు న్యాయవాది కోర్ట్ ని కోరారు. అయితే ఈ విషయం పై మాట్లాడిన హైకోర్ట్, లాక్ డౌన్ ముగిసిన తరువాత, మూడు వారాల లోపు, అన్ని ప్రభుత్వ భవనాలకు వేసిన రంగులు తొలగించే వరకు, ఎన్నికలు జరపటానికి వీలు లేదని, ఇప్పటికే ఆదేశాలు ఇచ్చామని గుర్తు చేసారు. రంగులు తొలగించకుండా, ఎన్నికలకు వెళ్తే, అప్పుడు కోర్ట్ ఏమి చెయ్యాలో అది చేస్తుందని అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read