అచ్చెన్నాయుడి అరెస్ట్ వ్యవహారంలో, పోలీసులు వ్యవహరించిన తీరు పై, ఏపి బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసారు. జగన్ మెప్పు పొందేందుకే, పోలీసులు ఇలా వ్యవహరించారని, బీజేపీ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ మాజీ ఎమ్మల్యే విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. విష్ణుకుమార్ రాజు గారి మాటల్లో "ఆరోపణలు వచ్చినప్పుడు నోటీసు ఇవ్వచ్చు, గౌరవంగా తీసుకుని వెళ్ళవచ్చు, అంతే కాని హడావిడిగా అచ్చెన్నాయుడి గారిని తీసుకు వెళ్ళాల్సిన అవసరం ఏమి వచ్చింది ?వారి భార్య గారు, బాత్ రూమ్ లో ఉండి, బాత్ రూమ్ నుంచి బయటకు వచ్చే లోపలే, ఈయన్ను హడావిడిగా ఎక్కించుకుని తీసుకుని రావటం అనేది, సబబు కాదు. ఇది నిజంగా చూస్తే, ఒక ఎమ్మెల్యే కాని, ఒక అపారమైన రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తికి కాని, ఇలా చెయ్యవలసిన అవసరం లేదు. ఆయన ఎక్కడికైనా పారిపోయే వ్యక్తి కాదు. ఎక్కడికో గోడ దుకేసో, దేశం వదిలి పారిపోయే వ్యక్తి కాదు. ఇటువంటి పనులు, పోలీసులు అధికారులు కూడా, ఇటువంటి పనులు, రాజకీయంగా మెప్పు పొందుదాము, ప్రభుత్వంలో ఉన్న పెద్దల దృష్టిలో పడదాము, అనే ఉద్దేశంతో చేసిన పనిగా అనిపిస్తుంది. వారు ఇంతకు ముందు చాలా మందిని అరెస్ట్ చేసి ఉంటారు, ఎప్పుడైనా ఈ విధంగా చేసారా ?"
"జీవితంలో ఏ పోలీసు అధికారి కూడా, ఎప్పుడూ తప్పు చెయ్యలేదా ? రాజకీయాల్లో ఉన్న వాళ్ళు, వాళ్ళ గుండెల మీద చెయ్య వేసుకుని చెప్పాలి, ఎప్పుడూ తప్పు చెయ్యలేదా ? ఏదైనా ఎంక్వయిరీలో తేల్చుకోవాలి, కాని ఇదేమి పధ్ధతి. ఎవరో 70 ఏళ్ళ మహిళ పోస్టు పెడితే, ఆవిడ పైన కేసులు పెట్టారు. ఎంత మంది పైన, ఏమేమి కేసులు ఉన్నాయి అన్నది అందరికీ తెలుసు. అవన్నీ ఇప్పుడు నేను విడమర్చి చెప్పనవసరం లేదు. మనం కూడా ఒక్కసారి ఆలోచించుకోవాలి. ప్రజలు ఏదైనా అడగాలి అంటే భయపడుతున్నారు. ఏదైనా పోస్ట్ పెట్టాలి అంటే, వాట్స్ అప్ ఫార్వర్డ్ చెయ్యాలి అంటే భయపడుతున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో, ఈ పధ్ధతి మంచి పధ్ధతి కాదు అని విష్ణు కుమార్ రాజు అన్నారు. అటు బీజేపీ ఎమ్మెల్యే మాధవ్ కూడా వైసీపీ తీరు పై విమర్శలు గుప్పించారు. కేంద్రం ఇచ్చిన నిధులు వాడుకుని, అవన్నీ తామే చేస్తున్నట్టు, వైసిపీ నేతలు డబ్బా కొడుతున్నారని అన్నారు. ఎల్జీ పాలిమర్స్ విషయంలో, ఇప్పటికీ అక్కడ ఇబ్బందులు పడుతున్నారని, వారికి ప్రత్యెక పైప్ లైన్ వేసి, మంచి నీళ్ళు సరఫరా చెయ్యాలని అన్నారు.