గత ప్రభుత్వ హయంలో, తమిళనాడులో ఉపయోగంగా లేని, సదావర్తి భూములు అమ్ముతాం అంటే, నానా యాగీ చేసిన వైఎస్ఆర్ పార్టీ, ఇప్పుడు అధికారంలోకి రాగానే, ఏకంగా శ్రీవారి ఆస్తులే అమ్మటానికి సిద్ధం అయ్యింది. తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్న ఈ నిర్ణయంతో, అందరూ అవాక్కయ్యారు. శ్రీవారి ఆస్తులు అమ్మాల్సిన అవసరం, టిటిడికి ఏమొచ్చింది అంటూ ప్రశ్నిస్తున్నారు. భూ విరాళం ఇచ్చిన వాటిల్లో, కొన్నిటిని అమ్మాలని టిటిడి నిర్ణయం తీసుకుంది. తమిళనాడులో ఉన్న వ్యవసాయ పొలాలు, ఇళ్ళ స్థలాలు అమ్మాలని నిర్ణయం తీసుకుంది. దాదాపుగా 25 ప్రాంతాల్లో ఉన్న ఆస్తులు అమ్మకానికి రంగం సిద్ధం చేసింది టిటిడి. ఆస్తుల నిర్వహణ భారంగా మారింది అని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు టిటిడి చెప్తుంది. చిన్న చిన్న స్థలాలు, పొలాల సంరక్షణ కష్టంగా మారింది అని, అందుకే అమ్మేస్తున్నాం అని చెప్తుంది.
తిరువళ్ళురు, ధర్మపురి, తిరుచ్చి, తిరుచిరాపల్లి, తిరువన్నమలై, నాగపట్నం, వేలూరు, కోయంబత్తూరు, కాంచీపురంలలో 25 స్థాలాలు, ఇళ్ళు, వ్యవసాయ పొలాలు అమ్మాకానికి పెట్టింది. అయితే దీనికి సంబంధించి రెండు నెలల క్రితమే నిర్ణయం తీసుకోగా, ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఆస్తుల వేలానికి, రెండు అధికార బృందాలను కూడా టిటిడి నియమించింది. వీటిలో 8 మంది అధికారులు ఉన్నారు. ఈ అధికారులు, ఆస్తుల వేలానికి సంబంధించి విధివిధానాలు సూచిస్తారు. మరో పక్క టిటిడి ఆస్తుల వేలం పై అన్ని వైపులా నిరసన తెలియ చేసింది. ఇండో-అమెరికన్ బ్రాహ్మణ సంస్థ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ ఈ విషయం పై స్పందించారు.
"వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా పథకం ప్రకారం వ్యవహరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది భక్తుల మనోభావాలను, విశ్వాసాలను కాలరాస్తోంది. తిరుమల కొండపై శిలువ వెలవడం, టీటీడీ వెబ్ సైట్ లో అన్యమత ప్రచారం, బోర్డులో అన్యమతస్తుల నియామకం, అమరావతిలో శ్రీవారి ఆలయానికి నిధుల తగ్గింపు, కొండపై దర్శనం, వసతి, అద్దె ధరలు పెంచడం వంటి చర్యలన్నీ ప్రభుత్వం దురుద్దేశంతో చేసినవే. భక్తులు పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డూను బల్క్ గా తయారుచేసి విక్రయించాలన్న టీటీడీ నిర్ణయం తిరుమల పవిత్రతను, భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉంది. శ్రీవారి ఆస్తుల విక్రయం కోసం కమిటీలు వేయడం, ఆస్తుల రిజిస్ట్రేషన్ బాధ్యత టీటీడీ అధికారులకు కట్టబెట్టడం వెనుక కుట్ర దాగి ఉంది. టీటీడీ ఆస్తులను తమ సొంత వారికి కట్టబెట్టేందుకే వేలం నిర్ణయం తీసుకున్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆస్తుల జోలికొస్తే తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోదు. తక్షణమే స్వామి వారి ఆస్తుల వేలాన్ని నిలిపేయాలని డిమాండ్ చేస్తున్నాం. టీటీడీ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే న్యాయ పోరాటం చేస్తాం. " అని అన్నారు.