ప్రపంచదేశాలను గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి గత నెలన్నర రోజులుగా చిత్తూరు జిల్లాను పీడిస్తోంది. జిల్లాలో నిర్వహించిన వైద్యపరీక్షలలో శనివారం వరకు కరోనా వ్యాధి సోకినవారి సంఖ్య 28 కాగా, ఆదివారం మరో 25 మందికి కరోనా వ్యాధి సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో జిల్లాలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 58కు పెరిగింది. వీరిలో గత రెండువారాల మధ్య కరోనా వ్యాధి నుంచి కోలుకుని ఆరోగ్యంతో ఇళ్లకు వెళ్లినవారు శ్రీకాళహస్తి, ఏర్పేడు, పలమనేరు ప్రాంతాలకు చెందిన నలుగురున్నారు. కాగా సోమవారం నాటికి 49 మంది చిత్తూరు, తిరుపతిల లోని కోవిడ్ ఆసుపత్రులలోని ఐసొలేషన్ వార్డులలో చికిత్స పొందుతున్నారు. గత 24 గంటల మధ్యకాలంలో పాజిటివ్ లక్షణాలతో అసుపత్రి పాలైన 25 మందిలో 10 మంది రెవిన్యూ, పోలీసు శాఖలకు చెందిన సిబ్బందికాగా ఇతరులలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారున్నారు. మరోవైపు ఈ 25 మందిలో గతంలో వ్యాధి సోకినవారి ద్వారా వ్యాధి సంక్రమించినవారే ఎక్కువగా ఉన్నారని ప్రకటించిన జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా వారికి ఏ విధంగా సోకిందనే విషయంపై ప్రత్యేకంగా దృష్టిని సారిస్తున్నట్టు తెలిపారు.
ఇంకోవైపు కరోనా వ్యాధి సోకి వైద్యచికిత్స పొందుతున్న 49 మంది కుటుంబసభ్యులు, సన్నిహితులు అనుమానితుల రూపంలో వివిధ క్వారంటైన్ కేంద్రాలలో 14 రోజుల వైద్యపర్యవేక్షణలో కొనసాగుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో కరోనా కేసుల నమోదు అంతా జిల్లా తూర్పు ప్రాంతాలకే పరిమితం కావడం, అందులో ఒక్క శ్రీకాళహస్తి పట్టణం లోనే 35 కేసులు నమోదుకావడం చర్చనీయాంశమవుతోంది. ఇప్పటివరకు జిల్లా తూర్పు ప్రాంతానికి చెందిన శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలోని రేణిగుంట, ఏర్పేడు మండలాలతో పాటు తిరుపతి, నగరి, నిండ్ర, వడమాలపేట మండల పరిధుల్లో 17 కేసులు నమోదయ్యాయి. తాజాగా సోమవారం చంద్రగిరి మండలం రంగంపేట ప్రాంతంలో నిర్వహిస్తున్న ఇంటింట్ సర్వేలో ఒక 70 ఏళ్ల వ్యక్తికి కరోనా సోకినట్టు పరీక్షల ద్వారా నిర్ధారణ అయినట్టు జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా ప్రకటించారు. దీంతో కరోనా ప్రభావం జిల్లా తూర్పు ప్రాంతాల్లోనే అత్యధికశాతం ఉన్నట్టు స్పష్టమవుతోంది.
అయితే ఈ పరిస్థితికి ప్రధాన కారణం, శ్రీకాళహస్తి వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి అంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి . లాక్ డౌన్ నిబంధనలను అతిక్రమించి, పదిరోజుల క్రితం ఎక్కువ మందితో భారీ ట్రాక్టర్ ర్యాలీ చెయ్యటం, ఆ ర్యాలీల అధికారులు కూడా పాల్గునటంతో ఈ పరిస్థితి వచ్చింది అని అంటున్నారు. ఆ ర్యాలీలో పాల్గొన్న 11 మంది ప్రభుత్వ అధికారులకు కరోనా పాజిటివ్ వచ్చింది. అయితే ఇప్పుడు దేశమంతా ఇదే చర్చ నడుస్తుంది. జాతీయ మీడియాలో కూడా ఇదే చర్చ జరుగుతుంది. ర్యాలీలు చేసి, అధికారులకు కరోనా అంటించారు అంటూ, నేషనల్ మీడియాలో, రచ్చ రచ్చ అవుతుంది. ఒక పక్క అందరూ లాక్ డౌన్ అంటుంటే, అధికార పార్టీనే ఇలా కరోనా వ్యాప్తికి కారకులు కావటం, గమనార్హం.