జగన్ మోహన్ రెడ్డి, నిన్న ఆదరాబాదరాగా, దక్షిణ కొరియా నుంచి లక్ష టెస్టింగ్ కిట్లు వచ్చాయని, ఇక నుంచి రాష్ట్రంలో కరోనా టెస్ట్ లు వేగం పుంజుకుంటాయని, ప్రచారం చేసారు. ఈ ప్రచారానికి, ఇంకా కొంచెం, ఎక్కువ చెయ్యటానికి, ఏకంగా జగన్ మోహన్ రెడ్డి చేత కూడా, ఈ టెస్టింగ్ చేపించి, అందరికీ ఫోటోలు విడుదల చేసారు. అయితే ప్రభుత్వం ప్రచారం కోసం చేసిన హడావిడితో, కేంద్రం సీరియస్ అయ్యింది అంటూ, టైమ్స్ అఫ్ ఇండియాకు చెందిన, బెంగుళూరు మిర్రర్ అనే పత్రిక సంచలన కధనం ప్రచురించింది. జగన్ మోహన్ రెడ్డి పై నిర్వహించిన రాపిడ్ కోవిడ్ -19 పరీక్ష ఐసిఎంఆర్ జారీ చేసిన తాజా మార్గదర్శకాలకు అనుగుణంగా ఉందా అని ప్రశ్నలు సంధించింది. జగన్ చేయించుకున్న కరోనా టెస్టు పై, అన్ని రాష్ట్రాల ఆరోగ్య అధికారుల మధ్య, అలాగే, కేంద్ర, ఐసిఎంఆర్ అధికారులు మధ్య చర్చ జరిగిందని చెప్తున్నారు. ఈ కధనం ప్రకారం, కేంద్రంలో ఉన్న ఒక కీలక అధికారి, జగన్ చేయించుకున్న టెస్టు గురించి, ప్రచారం జరిగిన వెంటనే, ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య కార్యదర్శికి మెసేజ్ పెడుతూ, టెస్టింగ్ ప్రోటోకాల్స్ గురించి సిఎం కార్యాలయానికి తెలియపరచాలని కోరారు.
ఇది ఇలా జరుగుతూ ఉండగానే, ఐసిఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ్ నిన్న, రాపిడ్ యాంటీబాడీ టెస్ట్ కిట్ల గురించి తాజా మార్గదర్శకాలను విడుదల చేశారు. "చాలా రాష్ట్రాలు ఈ కిట్‌లను హాట్ జోన్ ప్రాంతాల్లో ఉపయోగించాలని భావిస్తున్నట్టు తెలిసింది. అయితే , ఐసిఎంఆర్ నేషనల్ టాస్క్ ఫోర్సు, వివిధ దేశాల్లో, వాడుతున్న ఈ టెస్ట్ కిట్ల గురించి సమాచారం తెప్పించుకుంది. ఆ వివరాలు ప్రకారం, కరోనా టెస్టింగ్ కి సంబంధించి, తాజా మార్గదర్శకాలను సవరించాము. ర్యాపిడ్ యాంటీబాడీ పరీక్షలను ఉపయోగిస్తున్నప్పుడు ఈ క్రింది ముఖ్య విషయాలను అర్థం చేసుకోవడం చాలా అవసరం. " అంటూ కొన్ని మార్గదర్శకాలను, నిన్న కేంద్రం విడుదల చేసింది.
కరోనా వైరస్‌ను గుర్తించేందుకు, ప్రస్తుతం అమలులో ఉన్న పీసీఆర్ టెస్ట్ మాత్రమే చేయాలని అన్నారు. ర్యాపిడ్ యాంటీబాడీ టెస్టులు చేయొద్దని ఆదేశాలు ఇచ్చారు. ర్యాపిడ్ యాంటీబాడీ టెస్టుల్లో, వైరస్ వ్యాప్తి తీవ్రత మాత్రమే తెలుస్తుందని, అంతే కాని, ఇది రోగ నిర్ధారణ పరీక్ష కాదని చెప్పారు. లక్షణాలు ప్రారంభమైన కనీసం ఏడు రోజుల తర్వాత మాత్రమే రాపిడ్ యాంటీబాడీ పరీక్ష ఉపయోగపడుతుంది. అంతే కాని, ఈ పరీక్ష చెయ్యగానే, కరోనా ఉన్నట్టు, లేనట్టు తెలియదు అని చెప్పారు. ఇదే విషయన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెప్తూ, కన్ఫ్యూషన్ కు గురి చెయ్యవద్దు అని, సరైన సమాచారం బయటకు ఇవ్వాలని, ఆ సీనియర్ అధికారి కోరినట్టు, ఆ కధనంలో వచ్చింది. మరి దీనికి, రాష్ట్ర ప్రభుత్వం, ఏ విధంగా సమాధానం చెప్తుంది ? రియల్‌టైమ్ పాయింట్ ఆఫ్ కేర్ టెస్ట్ (ఆర్టీ-పీసీఆర్) చెయ్యాల్సిన చోట, ర్యాపిడ్ టెస్టులు పేరుతో, ప్రభుత్వం సరి పెడుతుందా ? చూడాలి మరి.