కరోనాకు తెలియదు ఆయన వైద్యుడని... తానుకాటు వేసే పచ్చని కుటుంబం నాశనమవుతుందని .... రోగాన్ని నయం చేసే డాక్టరైనా.. యాక్షరైనా సరే నా కాటు నుంచి తప్పించుకోలేరంటూ .. ప్రపంచ దేశాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి ఓ వైద్యుని కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. గత పక్షం రోజుల ముందు వరకు ఆనందానికి నిలయంగా ఉన్న డాక్టర్ కుటుంబంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. సాధారణంగా కుటుంబ యజమాని చనిపోతే ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయిందని ... ఆయనపై ఆధారపడిన వారంతా రోధిస్తూ కుమిలిపోతారు. అయితే నెల్లూరు జిల్లాలోనే కీళ్లు, ఎముకుల నిపుణులుగా పేరు తెచ్చుకున్న పి. లక్ష్మీ నారాయణ రెడ్డికి కరోనా కాటుకు బలైన తీరు. ఆ కుటుంబం ప్రస్తుతం ఉన్న స్థితిని చూస్తే ఎవరికైనా అయ్యో పాపం అంటూ గుండె తరుక్కుపోతోంది. ఇంట్లో 5 సంవత్సరాల పసిబిడ్డ. ఐసోలేషన్లో వైద్యుని సతీమణి, పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో వైద్యుని పార్థివదేహం.. భర్త మృత దేహాన్ని కడసారి చూపుకు కూడా నోచుకోలేని భార్య.. దీనస్థితిని చూస్తే ఐసోలేషన్లోని వైద్య సిబ్బంది సైతం కంటతడి పెట్టిస్తుంది.

మరోవైపు అమ్మా నాన్న ఎక్కడికి వెళ్లారో.. ఎప్పుడు వస్తారో తెలియ క ఇంట్లోనే వారి ఫొటోలు చూస్తూ ఏడుస్తున్న 5 సంవత్సరాల చిన్నారిని చూస్తూ సొంత బంధువులు సైతం ఆ బిడ్డను తల్లి దగ్గరకి తీసుకెళ్లలేక.. అటు తండ్రి అంత్యక్రియలను చూపించలేక... ఆ చిన్నారని ఓదార్చలేక కుమిలిపోతున్నారు. పగవాడికి కూడా ఇంత కష్టం రాకూడదంటూ దేవుడిని వేడుకుంటున్నారు. వినడానికే బాధగా ఉన్నా అత్యంత విచారకర సంఘటన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జరిగింది. ఓ వైద్యుని కుటుంబం దీనగాథ ఇది. నెల్లూరులో వైద్యుడు కీళ్లు, ఎముకులవైద్యశాలను నిర్వహిస్తున్నారు. ఈ నెల 2వ తేది నూతనంగా కొనుగోలు చేసి ఆధునీకరించిన వైద్యశాలను తనకు అత్యంత సన్నిహితులైన కొంతమంది వైద్యులతో కలిసి ప్రారంభించారు. అయితే అప్పటికే ఆయనకు జలుబు, జ్వరం ఉండడం, 4వ తేది ఆయన అస్వస్థతకు గురయ్యారు.

దీంతో ఆయనను స్థానికంగా పరీక్షలు నిర్వహించడంతో పాటు కరోనా పరీక్ష కూడా చేశారు. 5వ తేది పాజిటివ్ రిపోర్టు రావడంతో ఆయనను నగరంలోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. రెండు మూడు రోజులు చికిత్స అనంతరం బంధువులు మెరుగైన వైద్యం కోసం చెన్నైకు తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆయన పరిస్థితి ప్రమాదకరంగా ఉండడంతో జిల్లా అధికారులు ఈ పరిస్థితుల్లో పొరుగు రాష్ట్రానికి తీసుకెళ్లడం మంచిది కాదని సూచించారు. అయినా బంధువులు పట్టుబట్టి ఎలాగైనా ఆయనను దక్కించుకోవాలని చెన్నైకు తీసుకెళ్లారు. అక్కడ మెరుగైన చికిత్స అందిస్తున్నప్పటికీ ఆదివారం సాయంత్రం పరిస్థితి విషమించి ఆయన మృతిచెందారు. వైద్యుడు కరోనా కాటుకు బలి అయితే వారిలో ఒక్కరూ కూడా ఆయన పార్థివదేహాన్ని చూసేందుకు కూడా వెళ్లలేని దీనస్థితి .. ఆ పై మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు శ్మశాన వాటికలో సిబ్బంది కూడా ముందుకు రాకపోవడంతో ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం సాయంత్రం వరకు 24 గంటల పాటు వైద్యుని మృతదేహం రెండు శ్మశాన వాటికలకు తిప్పాల్సి వచ్చింది. ఆయన పార్థివదేహానికి అంత్యక్రియలు జరిగిన తీరు తెలుసుకున్నంత వారు అయ్యో పాపం అంటూ కంటతడి పెడుతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read