జగన్ మోహన్ రెడ్డికి, చంద్రబాబు లేఖ రాసారు. ఆరు అంశాల పై చంద్రబాబు ఈ లేఖ రాసారు. న రాష్రంలో సిఎంఆర్ ఎఫ్ కోసం బలవంతపు వసూళ్లు-రైతు సహకార సంఘాలు, మహిళా సంఘాలు, వ్యాపారుల్లో తీవ్ర వ్యతిరేకత-పేదలకు సహాయం అందించడంలో రాజకీయాలు చేయడం-ప్రధాని పిలుపును అపహాస్యం చేయడం-సాయం చేసే దాతలను మనస్తాపానికి గురిచేయడం-సాయం వారితో పంపిణీ చేయనీకుండా మేమే చేస్తామనడం-ప్రభుత్వ నిర్లక్ష్యం వైద్యులు, ప్రజల ప్రాణాలను బలిగొనడం-రక్షణ పరికరాల్లేక, పూర్తి స్థాయి జీతాలందక పారిశుద్య కార్మికులు, ఆశా వర్కర్లు ఇతర ఫ్రంట్ లైన్ వారియర్ల ఆవేదన-పరస్పర విరుద్దంగా హెల్త్ బులెటిన్లు, డ్యాష్ బోర్డు, ఆరోగ్య కార్యదర్శి చెప్పే అంకెలు-అసత్య ప్రచారం ఫలితంగా ప్రజల ప్రాణాలకే ముప్పుగా పరిణమించడం గురించి, చంద్రబాబు ఈ లేఖ రాసారు. అయితే ఈ సందర్భంగా, చంద్రబాబు చెప్పిన ఒక విషయం చూస్తే, ఆశ్చర్యం కలగుతుంది.
ఆయన, నాలుగవ పాయింట్ గా, రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకాల వల్ల ఏవిధంగా వైరస్ విస్తరిస్తోందో ఉదాహరణలు అంటూ లేఖలో ఇలా రాసారు. "జగ్గయ్యపేట మండలంలో మార్చి18న ఢిల్లీనుంచి వచ్చిన వ్యక్తిని 10రోజులు యధేచ్చగా జనంలో వదిలేసి మార్చి 28న క్వారంటైన్ కు తరలించారు. పాజిటివ్ కేసుగా అది బైటపడిందని, గ్రామంలో ఈ 10రోజులు అతను ఎవరెవరిని కలిశాడో ఈ రోజు (ఏప్రిల్ 17న) విచారిస్తున్నారు. అతని ఢిల్లీ పర్యటన సమాచారం సోషల్ మీడియా ద్వారా ముందే అందించిన వ్యక్తిని గతంలో పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి కొట్టి శారీరకంగా హింసించారు. ఇప్పుడేమో ఇన్నాళ్ల తర్వాత అతని కదలికలపై ఎంక్వైరీ చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా అప్రమత్తం చేసినప్పుడే అధికారులు ముందు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తం అయితే ఈ పరిస్థితి ఉండేదికాదు. వైరస్ వ్యాప్తిపై అందరినీ అప్రమత్తం చేసి, తగిన సమాచారం ఇచ్చేందుకు ఒకవైపు ప్రధాని నరేంద్రమోది ఆరోగ్యసేతు యాప్ ను తెచ్చారు. అలాంటిది సమాచారం ఇచ్చిన వ్యక్తిని స్టేషన్ లో కొట్టి, హింసించడం హేయం. ఎమ్మిగనూరుకు చెందిన ఒక వ్యక్తి ఏప్రిల్ 15 సాయంత్రం కర్నూలు ఆసుపత్రిలో చనిపోతే మృతదేహం ఇంతవరకు ఇవ్వలేదు. కరోనా వల్ల కాదని బంధువులను చెప్పమన్నారు. అతనికి పాజిటివ్ అనిగాని, కరోనా మృతుల జాబితాలో చేర్చడంగాని చేయలేదు. ఆయన బతికి ఉన్నప్పుడు గ్రామంలోఎవరెవరిని కలిశాడని ఇప్పుడు విచారిస్తున్నారు."
"రాజమండ్రిలో, విజయవాడలో, గుంటూరులో, కర్నూలులో, నెల్లూరులో ఇలాగే పాజిటివ్ కేసులను ముందే గుర్తించక పోయినందువల్ల ఆయా ప్రాంతాల ప్రజలు భారీ మూల్యం చెల్లించారు. గుంటూరులో ఒక వ్యక్తినుంచి 10మందికి వ్యాపించగా, విజయవాడలో ఒకవ్యక్తి నుంచి 8మందికి సోకడం ఈ సందర్భంగా గమనించాల్సిన అంశం. కర్నూలులో కరోనా రోగికి చికిత్స చేసినందుకు ఒక పేదల డాక్టర్ బలి అయ్యారు. సరైన రక్షణ పరికరాలు అందించివుంటే ఆ వైద్యుడిలా మరణించేవాడు కాదు. ఇప్పుడా డాక్టర్ వద్ద చికిత్స పొందిన రోగులు అందరిలో తమకు కూడా వైరస్ సోకిందేమో అనే భయాందోళనలు నెలకొన్నాయి. రూపాయికి, రూ 2 కు చికిత్స చేసే పేదల డాక్టర్ చనిపోయారనే బాధ ఒకవైపు, ఆయననుంచి తమకు అంటుకుందనే అనుమానాలు ఇంకోవైపున కర్నూలు వాసులు తల్లడిల్లుతున్నారు. నెల్లూరులో డాక్టర్ కూడా ఇలాగే బలి అయ్యారు. అనంతపురం, గుంటూరులో డాక్టర్లకు, నర్సులకు కూడా పాజిటివ్ వచ్చింది. ఇంకా ఎంతమంది డాక్టర్లు, నర్సులు, వైద్యసిబ్బంది బలి అయితే రాష్ట్ర ప్రభుత్వం అందరికీ రక్షణ ఉపకరణాలు అందిస్తుందని ఆయావర్గాలే నిగ్గదీస్తున్నాయి. బాధ్యతారహితంగా వ్యవహరిస్తే కలిగే దుష్ఫలితాలకు ఇవే ఉదాహరణలు. " అంటూ చంద్రబాబు లేఖలో ధ్వజమెత్తారు.