ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో ఈ రోజు విచారణ జరిగింది. విశాఖ ఎల్జీ పాలిమర్స్ లో గ్యాస్ లీకేజీపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్‌కు నివేదిక సమర్పించారు, విశ్రాంత న్యాయమూర్తి బి.శేషయానారెడ్డి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల కమిటీ సభ్యులు. స్టైరీన్ గ్యాస్ లీకేజీ మానవ తప్పిదం అని, భద్రతా ప్రమాణాల వైఫల్యం కూడా దీనికి తోడయ్యి, సంస్థ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని నివేదికలో విచారణ కమిటీ పేర్కొంది. నివేదిక పై అభ్యంతరాలను ఒక్కరోజులో చెప్పాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, ఎల్జీ పాలిమర్స్ ని కోరింది. నేడు సాయంత్రం లేదా రేపు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే అవకాశం ఉంది. ఎల్జీ పాలిమర్స్ తరపున వాదనలు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూత్ర వినిపించారు. గ్యాస్ లీకేజీ ఘటనను సుమోటోగా విచారణ చేపట్టే అధికారం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు లేదని వాదనలు వినిపించారు ఎల్జీ పాలిమర్స్ తరపున న్యాయవాది.
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సుమోటోగా విచారణ చేపట్టే అంశం పై సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉందని ఎల్జీ పాలిమర్స్ తరపు న్యాయవాది, ఎన్జీటీకి చెప్పారు. 2001 నుంచి అనుమతులు లేకుండా ఎల్జీ పాలిమర్స్ సంస్థ కార్యకలాపాలు సాగిస్తుందని మాజీ ఐఏఎస్ ఈఏఎస్ శర్మ వాదనలు వినిపించారు. గ్యాస్ లీకేజీ ఘటనలో బాధ్యుల పై కఠిన చర్యలు తీసుకోలని శర్మ, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ను కోరారు. తన పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకుని నోటీసులు ఇవ్వాలని ఈఏఎస్ శర్మ కోరారు. ఇప్పటికే ఎల్జీ పాలిమర్స్ విషయం పై, కేంద్ర, రాష్ట్రం, హైకోర్ట్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సహా, 7 సంస్థలు, జరిగిన ఘటన, పై విచారణ చేస్తున్నాయి. ఇప్పటికే ఈ విషయం పై, హైకోర్ట్ ఇచ్చిన ఆదేశాలతో, ఎల్జీ పాలిమర్స్ డిఫెన్సు లో పడిన సంగతి తెలిసిందే.