టీడీపీ ఎమ్మెల్సీ, బుద్దా వెంకన్న, విజయసాయి రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేసారు. "వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విఫల సాయి రెడ్డిగా మారారని ప్రజలు భావిస్తున్నారు. వైసీపీ లో ఉంటారా లేదా అని విజయసాయిని ఎవరూ అడగలేదు. అయినప్పటికీ చచ్చేదాకా వైసీపీలోనే ఉంటానని ఆయనకు ఆయనే చెప్పుకున్నారంటే..జగన్ తో గ్యాప్ వచ్చిందని స్పష్టంగా అర్ధమవుతోంది. పార్టీలో తలెత్తిన అంతర్గత విభేదాల వల్లే విజయసాయి ఇలాంటి స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. సీఎం జగన్ కారులో నుంచి దించాక విజయసాయిలో మార్పు కనిపిస్తోంది. ఒకప్పుడు ఢిల్లీ, విశాఖ తనదే అన్నట్టు విజయసాయి రెడ్డి మాట్లాడారు. ఉత్తరాంధ్రకు అన్నీ తానై వ్యవహరించారు. ఏపీకి ముఖ్యమంత్రి జగనా లేక విజయసాయా అన్నంత సీన్ క్రియేట్ చేశారు. చివరకు తాను పార్టీలోనే ఉంటానని చెప్పుకోవడం ద్వారా విజయసాయిని జగన్ పక్కన పెట్టారన్నది అర్ధమవుతోంది. ఇంతకుముందు జగన్ ఢిల్లీ పర్యటనలో అన్నీ తానై విజయసాయి వ్యవహరించేవారు. ఇప్పుడు జగన్ ఢిల్లీ టూర్ అనగానే విధేయుడినని తనకు తానే చెప్పుకోవాల్సిన పరిస్థితి విజయసాయికి వచ్చింది. విజయసాయి దందాలే ఈ పరిస్థితికి కారణం. ప్రశాంతమైన ఉత్తరాంధ్రను విజయసాయి అండ్ గ్యాంగ్ దోచేస్తున్నారు."
"వైసీపీ సోషల్ మీడియా తానే చూసుకుంటానని విజయసాయి చెబుతుంటే.. సోషల్ మీడియా మురుగు గుంట అని సజ్జల రామకృష్ణా రెడ్డి అంటున్నారు. సోషల్ మీడియా వేదికగా మీరు చేస్తున్న పనులన్నీ చెత్త అని సజ్జల చెప్పకనే చెప్పారు. సోషల్ మీడియాలో హైకోర్టుకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన వ్యక్తులను విజయసాయి కాపాడబోతున్నారా? చంద్రబాబు, లోకేష్ పై అసత్యపు ట్వీట్లు పెట్టడమే విజయసాయి పని. ఒక బాధ్యతాయుతమైన రాజ్యసభ ఎంపీగా ఉండి న్యాయవ్యవస్థను దూషించే వారిని కాపాడతానని విజయసాయి ఎలా చెప్పగలుగుతున్నారు? 16 నెలలు జైల్లో ఉండొచ్చారు విజయసాయి. వయసుకు తగిన మాటలు మాట్లాడటం లేదు. పదవిని దేనికైనా వాడుకోవచ్చని ఆయన భావిస్తున్నారు."
"సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించింది విజయసాయి రెడ్డే. ప్రభుత్వాలు మారుతుంటాయి. పదవులు వస్తుంటాయి పోతుంటాయి. మాట్లాడేప్పుడు ఆచితూచి మాట్లాడాలి. గాంధేయ మార్గం గురించి మాట్లాడుతున్న విజయసాయి తనపై , జగన్ పై నమోదైన కేసులపై సమాధానం చెప్పాలి. కేసులున్నాయని నిజాయితీగా ఒప్పుకోగలరా? మిడతలు పంటను నాశనం చేస్తుంటే... పచ్చగా ఉన్న విశాఖను విజయసాయి అండ్ గ్యాంగ్ నాశనం చేస్తున్నారు. వైసీపీ ఏడాది పాలనపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. వైన్ షాపు, చిల్లర కొట్టు, గుడి, బడి దగ్గరకు వెళ్లి అడగండి మీ పాలన గురించి తెలుస్తుంది. వైసీపీ పాలన బాగుందని ఒక్కరు చెప్పినా రాజకీయాల నుంచి తప్పుకుంటాం. న్యాయవ్యవస్థపై గౌరవం ఉందని చెబుతున్న విజయసాయి రెడ్డి లక్షల కోట్లు దోచేశామని నిజాయితీగా ఒప్పుకోవాలి. ఓ వైపు ప్రజలను రెచ్చగొడుతూ మరోవైపు కోర్టులను తప్పుబడుతున్న విజయసాయి రెడ్డి ...ఎంపీగా ఉండేందుకు అనర్హుడు. ఆయన తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలి." అని అన్నారు.