మే 7 న జరిగిన విశాఖపట్నం గ్యాస్ లీక్ ఫలితంగా జరిగిన పర్యావరణ నష్టం, ప్రాణ నష్టానికి పూర్తి బాధ్యత, దక్షిణ కొరియా కంపెనీ ఎల్జీ పాలిమర్స్ అని, జరిగిన నష్టానికి పూర్తి బాధ్యత ఎల్జీ పాలిమర్స్ కే ఉంది అంటూ, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జిటి) ఈ రోజు తేల్చి చెప్పింది. ఇంతకుముందు ఇచ్చిన ఉత్తర్వులో, ముందస్తుగా విశాఖపట్నం జిల్లా మేజిస్ట్రేట్ ముందు రూ .50 కోట్లు జమ చేయాలని ఎన్జిటి కంపెనీని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు, జమ చేసిన ఈ మొత్తాన్ని, పర్యావరణ పునరుద్ధరణకు మరియు బాధితులకు పరిహారం కోసం ఉపయోగించాలని, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. 30 కోట్లు ప్రభుత్వం పరిహారం కింద జీవో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు మొత్తం పరిహారం, ఆ కంపెనీనే భరించాలి అంటూ, ఎన్జీటి స్పష్టం చేసింది. అయితే ఇదే సందర్భంలో, ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ని, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సుమోటాగా తీసుకోవటం పై, ఎల్జీ పాలిమర్స్ అభ్యంతరం చెప్పటం పై, గ్రీన్ ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఎన్జిటి ఒక ప్రత్యేక ట్రిబ్యునల్ అని, పర్యావరణ ప్రమాదాల జరిగినప్పుడు, చూస్తూ కూర్చోం అని, సుమోటోగా తీసుకోవడానికి అధికారం ఉందని, ఉత్తర్వులను సమర్థవంతంగా పాస్ చేయగలదని ఎన్జీటీ చెప్పింది. ఇటువంటి పర్యావరణ విషాదాల బాధితులు అట్టడుగు వర్గాలకు చెందిన వారు అయినప్పుడు ఈ విస్తృత అధికారాలు మరింతగా ఉపయోగిస్తాం అని ట్రిబ్యునల్ తెలిపింది. ఇటువంటి సందర్భాల్లో, ఇది ట్రిబ్యునల్ కు ఉన్న అధికారం మాత్రమే కాదు, సమర్థవంతమైన పరిహారం కోసం అటువంటి అధికారాన్ని ఉపయోగించడం మా విధి అని ఎన్జీటీ చెప్పింది. వైజాగ్ గ్యాస్ లీక్ వంటి కేసులలో తన పాత్ర పై గట్టిగా చెప్పింది ఛైర్మన్ జస్టిస్ ఎకె గోయెల్ నేతృత్వంలోని ధర్మాసనం. ఇతర వేదికల ముందు గ్యాస్ లీక్ కేసుకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న విచారణ పై, ఎన్‌జిటి విచారణ ప్రభావం చూపదు అని, వాటి పరిధిలో , వాటి విచారణ జరుగుతుంది అని తేల్చి చెప్పింది.
పునరుద్ధరణ ప్రణాళిక కమిటీ ఏర్పాటు చేస్తున్నామని, పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (MoEF & CC), కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సిపిసిబి) మరియు ఆంధ్రప్రదేశ్ప్రభుత్వం నుంచి, ప్రతినిధులతో కూడిన కమిటీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పింది. ఈ కమిటీ, ప్రణాళికను రెండు నెలల వ్యవధిలో సిద్ధం చేయాలని ఎన్‌జిటి ఆదేశించింది. చేసిన అంచనా, పునరుద్ధరణ ప్రణాళిక ఆధారంగా, ఫైనల్ గా పరిహారం లెక్కించబడుతుందని ఎన్జీటీ చెప్పింది. ఇక తరువాత, చట్టబద్ధమైన అనుమతులు లేకుండా పనిచేయడానికి సంస్థకు అనుమతించడంలో చట్ట వైఫల్యానికి కారణమైన వ్యక్తుల పై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుర్తించి, తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. వచ్చే విచారణను, నవంబర్ 3వ తేదీకి, ఎన్జీటీ వాయిదా వేసింది.