కేంద్రం డబ్బులు ఇస్తున్నా, కనీసం ప్రధాని మోడీ పేరు కాని, కేంద్రం పేరు కాని లేకుండా, ఒక పక్క వైఎస్ఆర్ బొమ్మ, దాని కింద జగన బొమ్మ పెట్టుకుంటూ హడావిడి చెయ్యటం పై బీజేపీ పార్టీ భగ్గు మంది. ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి ప్రవేశ పెట్టిన రైతు భరోసా పై, బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర రైతన్నలకు, ప్రధాని నరేంద్ర మోడీ గారు, ఏడాదికి రూ.6000/- పంపిస్తుంటే, ఆ డబ్బులు కలిపి ఇస్తూ, రూ.13,500/- తాను, తన తండ్రి ఇస్తున్నట్టు, ఫోటోలు పెట్టుకుని ప్రచారం చెయ్యటం ఏమిటి ? కేంద్రం ఈ రాష్ట్ర రైతన్నలకు ఇస్తున్న రూ.6000/- గురించి ప్రస్తావించకుండా, ప్రధాని ఫోటో లేకుండా, ఈ ప్రచారం ఏమిటి ? అంటూ బీజేపీ నిలదీసింది. "రూ.12,500/- రాష్ట్రం నుంచి ఇస్తాను అని చెప్పి, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రూ.6000/- కూడా కలిపి ఇస్తూ, ఏదో త్యాగం చేసినట్టు మాట్లాడుతున్నారు. రూ.13,500/- కాదు, కేంద్రం ప్రభుత్వం ఇచ్చే రూ.6000/-, హామీ ఇచ్చిన రూ.12,500 కలిపి, రూ.18,500/- ఇవ్వాలి. ప్రతి అన్నదాతకు పడిన బాకీ రూ.5,000/- వెంటనే విడుదల చెయ్యాలి." అని బీజేపీ నిలదీసింది.
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఒక ప్రెస్ నోట్ విడుదల చేసారు. "రాష్ట్ర ప్రభుత్వం నేడు విడుదల చేసిన పీఎం కిసాన్ ప్రకటన. ప్రధాని బొమ్మనే లేపేసి, మొత్తం 13,500 రూపాయలని తానే భరిస్తున్నట్టు బాక్స్ కట్టి మరీ ప్రచారం చేసుకుంటున్న వైనం. మరో స్టిక్కర్ సీఎం. పాదయాత్రలో జగన్ రైతులకు ఇచ్చిన వాగ్దానం సంవత్సరానికి రూ 12,500/- ఒకే సారి రైతుల ఖాతాలో జమ చేస్తానని. ఆ ప్రకటన కన్నా ముందే కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైతులకు పంట పెట్టుబడి సాయం క్రింద సంవత్సరానికి రూ 6000 మూడు విడతలుగా ఇస్తామని చెప్పి ఆ మేరకు ఇవ్వటం జరుగుతున్నది. రాష్ట్రంలో రైతులు కేంద్రం ఇస్తున్న ఆరు వేల రూపాయలకు అదనంగా జగన్ హామీ ఇచ్చిన 12,500/- వస్తాయని నమ్మి అధికారం కట్టబెట్టారు."
"మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన వైసీపీ బీజేపీ నేతృత్వంలోని మోడీ సర్కార్ ఇస్తున్న ఆరువేల రూపాయలను కలిపి అంతా తామే ఇస్తున్నట్టు ప్రచారం చేసుకోటమ్, ప్రచార ప్రకటనల్లో ప్రధాని బొమ్మను కూడా తీసేయటం రాష్ట్ర ప్రజలను మోసం చేయటమే. పీఎం కిసాన్ - రైతు భరోసా పథకంలో కేంద్రం వాటా 45% పైగా ఉన్నది. ఈ పథకం అమలు చేసే రోజున ఇచ్చిన ప్రకటన కూడా ఇక్కడ జత చేస్తున్నాను. దానిలో ప్రధాని నరేంద్ర మోడీ బొమ్మ ఉండటం గమనించగలరు. ఈ రకమైన అసత్య ప్రచారం ద్వారా ప్రజలను మోసంచేయటo ప్రజలను మోసంచేయటమే. ఇటువంటి అసత్య ప్రచారాలను భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. తక్షణం ఈ అసత్య ప్రకటనను వెనక్కు తీసుకొని, ప్రధాని నరేంద్ర మోడీ బొమ్మతో కూడిన ప్రకటన విడుదల చేయాలి. కేంద్రం ఇస్తున్న 45% నిధుల ప్రస్తావన కూడా ఆ ప్రకటనలో పొందు పరచాలని బీజేపీ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది." అంటూ ధ్వజమెత్తారు.