విశాఖలోని ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమ వద్ద పరిస్థితి అదుపులోకి వచ్చిందని వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు వెల్లడించారు. పరిశ్రమ వద్ద 82.6 డిగ్రీల ఉష్ణోగ్రత ఉందని తెలిపారు. అయితే మరో 24 గంటలు పరిసర గ్రామ ప్రజలు శిబిరాల్లో ఉండాలని ఆయన కోరారు. కేజీహెచ్‌ నుంచి డిశ్చార్జ్ అయిన వ్యక్తులు కూడా శిబిరాల్లో ఉండాలని... అక్కడ అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. విశాఖలో మంత్రులు బొత్స సత్యనారాయణ, అవంతి శ్రీనివాస్​తో సహా ఆయన మీడియాతో మాట్లాడారు. దక్షిణ కొరియాలోని ఎల్​జీ పాలిమర్స్ సంస్థ ప్రతినిధులతో అధికారులు మాట్లాడారని కన్నబాబు వెల్లడించారు. ఘటనపై నివేదిక ఇవ్వాలని కంపెనీ ప్రతినిధులను ఆదేశించామని చెప్పారు. ప్రజలు, పర్యావరణంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో నివేదిక ఇవ్వాలని కోరామన్నారు. ప్రభుత్వం ప్రకటించే వరకు ఎల్​జీ పాలిమర్స్ పరిశ్రమ పరిసరాల్లోని గ్రామాల ప్రజలు ఇళ్లకు వెళ్లవద్దని మంత్రి అవంతి సూచించారు. ఆయా గ్రామాల్లో నిపుణుల బృందం పర్యటించిందన్న మంత్రి, వారి సూచనల ప్రకారం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.

విశాఖలోని ఎల్​జీ పాలిమర్స్​ వద్ద పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందని మంత్రి అవంతి శ్రీనివాసరావు వెల్లడించారు. స్టైరిన్ ట్యాంక్ ఉష్ణోగ్రత 80 డిగ్రీలకు తగ్గిందన్నారు. పరిశ్రమ చుట్టు పక్కల గ్రామాల్లో నివాసానికి అనువైన పరిస్థితులపై నిపుణుల కమిటీ అధ్యయనం చేస్తోందన్న మంత్రి... నివేదిక వచ్చే వరకు ప్రజలు గ్రామాలకు రావద్దని కోరారు. స్టైరిన్ ట్యాంక్ వద్ద పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందని ఎల్‌జీ పాలిమర్స్‌ కంపెనీ జీఎం మోహన్​రావు చెప్పారు. ప్రమాదానికి కారణమైన స్టైరిన్ లిక్విడ్ గడ్డకట్టి పాలిమర్ అయ్యిందని అన్నారు. దీని నుంచి ఎలాంటి వాయువు బయటకు రావడం లేదని స్పష్టం చేశారు.

ఇది కాకుండా కంపెనీలో 2, విశాఖ పోర్టులో 2 స్టోరేజ్ ట్యాంకులు ఉన్నాయని... వాటిల్లో ఉష్ణోగ్రతలు నియంత్రణలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ట్యాంకుల్లో ఉన్న లిక్విడ్ స్టైరిన్‌ను వెనక్కి పంపే ఆలోచన చేస్తున్నామని జీఎం వివరించారు. మరో పక్క, విశాఖ ఎల్జీ పాలిమర్స్ ప్రమాద ఘటనలో బాధితులకు ఆసుపత్రుల్లో చేదు అనుభవం ఎదురవుతోంది. చికిత్స కోసం ఆసుపత్రులకు వెళితే వారిని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిహారం కోసం ఆసుపత్రుల్లో చేరుతున్నారా అని కొంతమంది వైద్య సిబ్బంది మాట్లాడుతున్నారని బాధితులు వాపోతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read