ప్రకాశం బ్యారేజ్, గుంటూరు జిల్లాని, కృష్ణ జిల్లాని కలిపే వారధి.... ఎవరైనా సరే బెజవాడ వస్తే, ప్రకాశం బ్యారేజిని సందర్శించి ఒక ఫోటో తీసుకోవాల్సింది.. అంత అందంగా ఉంటుంది ఆ ప్రదేశం.... బ్యారేజీ వద్ద నలువైపులా ఎత్తైన కొండలు, బ్యారేజీలో నిరంతరం నిల్వ ఉండే నీరు, నది మధ్యలో అక్కడక్కడా ఏర్పాటైన లంక భూముల్లో పచ్చని ప్రకృతి మైమరిపిస్తూ, పర్యాటకులను ఆహ్లాదపరుస్తుంది. నవ్యాంధ్ర రాజధాని అమరావతికే ఈ బ్యారేజి ఒక ఐకాన్ అంటే అతిశయోక్తి కాదు... అటు ఐదు జిల్లాల రైతులకి ఆయువుపట్టు ... అంతటి విశిష్టత కలిగిన మన ప్రకాశం బ్యారేజి 60 వసంతాలు పూర్తి చేసుకుంది... పసిడి పంటల సిరులతో, గలగల పరవళ్లతో ప్రవహించే కృష్ణమ్మ ఒడిలో జరగనున్న షష్టిపూర్తి వైభవం...
ఇదీ చరిత్ర: 1832-33 సంవత్సరంలో తీవ్ర కరువుకు లక్షలాది మంది అశువులు బారటంతో అప్పటి ప్రభుత్వం కృష్ణా నది పై ఆనకట్టు నిర్మించాలని డెల్టాకు సాగునీరు అందించాలని తలపెట్టింది. ఇందులో భాగంగా 1847వ సంవత్సరంలో సర్ ఆర్థర కాటన్ సిఫార్సులకు అనుగుణంగా, కెపెన్ ఓర్ ఆద్వర్యంలో ప్రకావం బ్యారేజి ఉన్న స్థానంలో రెండు కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టి 1852లో ప్రారంభించారు. ఈ ఆనకట్ట ద్వారా కృష్ణా, పశ్చిమ, తూర్పు డెల్టాలకు 5.8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేవారు.
100 సంవత్సరాలు సేవలు అందించిన తరువాత 1952 సంవత్సరంలో వచ్చిన వరదలకు ఆనకట్టు గండిపడి కొంత భాగం కొట్టుకుపోవడంతో నూతన బ్యారేజి అప్పటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులచే 13.2.1952 సంవత్సరంలో శంఖుస్థాపన చేయబడి, 1957 నాటికి పూర్తిచేశారు. 24.12.1957 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి బ్యారేజిని ప్రారంభిస్తూ ప్రకావం బ్యారేజిగా నామకరణం చేశారు. అప్పటి నుండి ఇప్పటివరకు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాలకు సాగు, త్రాగునీరు అందిస్తూ, ఆయువుపట్టుగా నిలిచింది. 2009 సంవత్సరంలో 11.10 క్యూసెక్కుల గరిష్ట వరద ప్రవాహాన్ని తట్టుకుని నిలబడిన పటిష్టమైన కట్టడం. ప్రకాశం బ్యారేజి పొడవు 1,223.5 మీటర్లు (4,014 అడుగులు), 24 అడుగుల వెడల్పుతో రోడ్డు, రోడ్డుకు రెండు వైపులా 5 అడుగుల వెడల్పుతో నడకదారి కూడా ఉంటుంది. ఊహించని రీతిలో పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను పవిత్రసంగమం వద్ద అనుసంధానం చేయడంతో పాటు, పులిచింతల ప్రాజెక్టు ద్వారా అదనపు జలాలు వలన ప్రకాశం బ్యారేజి విశిష్టత మరింత పెరిగింది.