రాష్ట్ర ప్రభుత్వ చట్ట వ్యతిరేక పనులు, ఆదేశాల పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇటీవల అనేక వ్యాఖ్యలు చేసినా, ప్రభుత్వ అధికారులలో మాత్రం ఎలాంటి మార్పు కనపడటం లేదు. తమ అధికారాలకు చట్టాలు వర్తించవు, తాము చెప్పేదే ఫైనల్ అన్నట్టుగా కొంత మంది అధికారులు వ్యవహరిస్తున్న తీరు, తీవ్ర అభ్యంతరకరంగా మారుతుంది. తాజాగా నిన్న హైకోర్టు, మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం అవుతుంది అంటూ, వ్యాఖ్యానించింది. చిత్తూరు జిల్లా కుప్పం మునిసిపల్ ఎన్నికల జరుగుతున్న ప్రాంతాల్లో, ఎన్నికల ప్రచారం చేయాలి అంటే, అక్కడ స్థానిక డీఎస్పీ అనుమతి తీసుకుని చేయాలని, తమ వద్ద నుంచి ముందస్తు అనుమతి తీసుకోకపోతే, ఇండియన్ పోలీస్ ఆక్ట్ ప్రకరం చర్యలు తీసుకుంటాం అంటూ, అక్కడ డీఎస్పీ జారీ చేసిన ఆదేశాల పై హైకోర్టు సీరియస్ అయ్యింది. ఆ ఆదేశాల పై స్టే విధించింది. ఈ సందర్భంగా హైకోర్టు కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ రోజు ప్రచారం చేసుకునేందుకు అనుమతి అడుగుతున్న పోలీసులు, రేపు నామినేషన్ వేసేందుకు కూడా అనుమతి అడుగుతారేమో అంటూ హైకోర్ట్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం, ఎన్నికల ప్రచారంలో, అనుమతి తీసుకోవాలని ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోయినా, డీఎస్పీ ఏ అధికారాలతో ఆ ఆదేశాలు ఇచ్చారు అంటూ కోర్ట్ ప్రశ్నించింది.
ఈ ఆదేశాలు చూస్తుంటే, రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు అంటూ కోర్టు వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో అనేక చోట్ల ఎన్నికలు జరుగుతున్నాయని, ఎక్కడా లేని ఆంక్షలు కేవలం కుప్పంలోనే ఎందుకు పెట్టారు అంటూ కోర్టు ప్రశ్నించింది. డీఎస్పీ ఇచ్చిన ఆదేశాల పై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు, ఆ ఆదేశాల పై స్టే విధిస్తూ, ఈ మొత్తం వ్యవహారంలో డీఎస్పీ నుంచి వివరణ తీసుకోవాలి అని, ఆ వివరాలు కోర్టుకు తెలపాలి అంటూ, హైకోర్టు చిత్తూరు జిల్లా ఎస్పీని ఆదేశించింది. తెలుగుదేశం పార్టీ నాయకులకు కుప్పంలో ప్రచారం నిర్వహించుకోవచ్చని చెప్పింది. ఎన్నికల్లో ప్రచారం చేసుకోవటం అనేది రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని కోర్టు గుర్తు చేసింది. ఈ హక్కులను ఎవరూ హరించలేరని తేల్చి చెప్పింది. ఈ కేసు పై తదుపరి విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది. మొత్తానికి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలను కుప్పం రానివ్వకుండా, వారు ప్రాచారం చేసుకునే వీలు లేకుండా, కేవలం తామే ప్రచారం చేసుకోవాలని చుసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది అనే చెప్పాలి..