ఏ రాష్ట్రంలో అయినా అప్పులు అనేవి చాలా ముఖ్యం. ఆ అప్పులు ఎలా ఉపయోగిస్తున్నాం అనే దాని పైన, మనం తీసుకునే అప్పుకు సార్ధకత ఉంటుంది. అప్పు తీసుకుని అభివృద్ధి చేస్తే అది ఉపయోగం. అప్పు తీసుకుని రెండో రోజే ఖర్చు పెడితే, అది గుడ్లు పెట్టి, మన తల మీద భారమై కూర్చుంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎడా పెడా అప్పులు చేస్తుంది. అప్పుల కోసం అడ్డ దారులు కూడా తొక్కుతుంది. అప్పుల కోసం నైతికత లేకుండా, మద్యం ఆదాయం కూడా తాకట్టు పెడుతుంది. అప్పుల కోసం గవర్నర్ పేరు కూడా వాడుకుంటుంది. ఇంతా చేసి, ఆ అప్పులు సరిగ్గా అభివృద్ధి కార్యక్రమాలకు వాడుతున్నారా అంటే, లేదు, అవి దారి మళ్ళిపోతున్నాయి. చివరకు ప్రపంచ బ్యాంక్ నుంచి తీసుకున్న అప్పుని కూడా ఏపి ప్రభుత్వం ఇలాగే చేయటంతో, ప్రపంచ బ్యాంక్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రపంచ బ్యాంక్ నిధులు రాష్ట్రాలకు చాలా అవసరం. అనేక ప్రాజెక్ట్ లలో ప్రపంచ బ్యాంక్ లోన్ ఇస్తుంది. దీనికి కేంద్ర ప్రభుత్వం పూచి కూడా ఉంటుంది. అంటే మనం ఎంత భాద్యతగా ఉండాలి ? ఏమైనా తేడా వస్తే, మనకు ఏమి అవుతుందో పక్కన పెడితే, మనకు పూచికత్తు ఉన్నందుకు, ప్రపంచ బ్యాంక్ దగ్గర మన దేశ పరువు పోతుంది. సరిగ్గా అదే జరిగింది. ఏపి ప్రభుత్వం ఇబ్బందుల్లో పడింది.
ప్రకృతి విపత్తుల వల్ల దెబ్బతినే మౌళిక వసతులు మళ్ళీ పునరుద్ధరించేందుకు, ప్రపంచ బ్యాంక్ రుణం రూపంలో నిధులు ఇస్తుంది. ఈ ప్రాజెక్ట్ చాలా పెద్దది, వేల కోట్ల రూపాయలు, మనం చేసే పనులకు తగ్గట్టు దశల వారీగా ఇస్తారు. పని అయిన తరువాత, ఆడిట్ చేసి డబ్బులు ఇస్తారు. అయితే ఈ ప్రాజెక్ట్ లో, కాంట్రాక్టర్ లకు డబ్బులు కట్టలేదని, ప్రపంచ బ్యాంక్ గుర్తించింది. ఏపి ప్రభుత్వం రూ.110 కోట్లు బకాయిలు పడినట్టు గుర్తించింది. ప్రపంచ బ్యాంక్ నిధులు దారి మళ్ళాయి. దీంతో ప్రపంచ బ్యాంక్ , వెంటనే ఆ బకాయలు చెల్లించాలని, అక్టోబర్ 15 వరకు సమయం ఇచ్చింది. మన ప్రభుత్వం కోర్టులనే లెక్క చేయదు కదా, వీళ్ళ మాట కూడా వినలేదు. పైగా కాంట్రాక్టర్ సమయం పెంచాలని కోరింది. దీంతో ప్రపంచ బ్యాంక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, కేంద్రం ఆమోదంతోనే ఈ ప్రాజెక్ట్ వచ్చింది కాబట్టి, ఈ విషయం కేంద్రం వద్దే తెల్చుకుంటానికి సిద్ధం అయ్యింది. మరి కేంద్ర ఆర్ధిక శాఖ ఏమి చెప్తుందో కానీ, ఇప్పుడు భవిష్యత్తు ప్రాజెక్ట్ ల పై ఎలాంటి మచ్చ పడుతుందో చూడాలి.