రాష్ట్రంలో ప్రస్తుతం నడుస్తున్న చర్చ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గిస్తుందా లేదా అని ? దీపావళి ముందు రోజు కేంద్ర ప్రభుత్వం, పెట్రోల్, డీజిల పై సుంకాన్ని తగ్గించింది. పెరిగిన పెంపుతో పోల్చితే, ఇది పెద్ద పెంపు కాకపోయినా, కచ్చితంగా ఊరట అనే చెప్పాలి. అయితే కేంద్రం, రాష్ట్రాలను కూడా తగ్గించమని కోరింది. తమ వంతు రాష్ట్ర పన్నుల రూపంలో తీసుకుంటున్న పన్నులును కూడా తగ్గించాలని కేంద్రం, రాష్ట్రాలను కోరింది. కేంద్రం అభ్యర్ధనను 23 రాష్ట్రాలు అంగీకరించి, తమ వంతు వాటాగా కూడా కేంద్రం కంటే ఎక్కువగా కొన్ని రాష్ట్రాలు తగ్గించాయి. దీంతో కేంద్రం తగ్గించిన పన్ను, రాష్ట్రం తగ్గించిన పన్ను, రెండూ కలిపి దాదాపుగా రూ.15 వరకు తగ్గుముఖం పట్టింది. అయితే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఉలకటం లేదు, పలకటం లేదు. గతంలో జగన్ మోహన్ రెడ్డి బాదుడే బాదుడు అంటూ చేసిన ప్రసంగాలు, అసెంబ్లీలో ఆవేశంగా చేసిన ప్రసంగాలు చూసి, జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడు తగ్గిస్తారా అని ఏపి ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్న సందర్భంలో, నిన్న డిప్యూటీ మంత్రి ధర్మాన స్పందిస్తూ చేసిన ప్రకటన కొంత ఊరట ఇచ్చింది. కేంద్రం పెట్రోల్ ధరలు తగ్గించటం మంచి పరిణామం అని చెప్తూ, రాష్ట్ర ప్రభుత్వం కూడా సరైన సమయంలో, సరైన నిర్ణయం తీసుకుంటుంది చెప్పారు.
ఈ ప్రకటన చూసిన చాలా మంది సంబర పడ్డారు. ధరలు తగ్గిస్తారని ఆశ పడ్డారు. అయితే అటు ధర్మానకు, ఇటు రాష్ట్ర ప్రజలకు కూడా షాక్ ఇచ్చేలా ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం వేసిన ప్రకటన చూసిన వారికి షాక్ తగిలింది. ధర్మాన సరైన సమయంలో సరైన నిర్ణయం అని చెప్పి 12 గంటలు అవ్వక ముందే, ఈ రోజు పేపర్లో పెట్రోల్, డీజిల్ ధరల పై ప్రభుత్వం ప్రకటన చూసి అందరూ షాక్ అయ్యారు. ఆ ప్రకటన చూస్తే, తప్పు అంతా కేంద్రం, చంద్రబాబుది అని, మా తప్పు ఏమి లేదని, మేము తగ్గించం అనే విధంగా ఆ ప్రకటన ఉంది. సహజంగా నిన్న ధర్మాన సరైన సమయంలో సరైన నిర్ణయం ని అంటే, జగన్ మోహన్ రెడ్డితో మాట్లాడి ఆ ప్రకటన చేసి ఉంటారని ఎవరైనా అనుకుంటారు. కానీ ఈ రోజు పేపర్ ప్రకటనలో మాత్రం, పూర్తి విరుద్ధంగా ఉంది. రోడ్డు సెస్ ఎందుకు వేస్తున్నమో చెప్పారు. వ్యాట్ పాపం మాది కాదని చెప్పే ప్రయత్నం చేసారు. అంటే, ఇవన్నీ చూసిన వారికి, తాము తగ్గించం అని చెప్పకనే చెప్పినట్టు ఉంది. మరి ధర్మాన గారు చెప్పినట్టు, సరైన సమయంలో, సరైన నిర్ణయం ఎప్పుడు వస్తుందో ? తొందరగా రావాలని కోరుకుందాం.