చాలా రోజుల తరువాత ఈనాడు పత్రిక ఒక సంచలన కధనంతో ముందుకు వచ్చింది. ఈ మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ, అలాగే ఆ పార్టీ నేత పయ్యావుల కేశవ్, సోలార్ విద్యుత్ కొనుగోళ్ళ ఒప్పందాల్లో జురుగుతున్న పెద్ద స్కాం గురించి బయట పెట్టిన సంగతి తెలిసిందే. సెకి సంస్థ మధ్యవర్తిగా ఉంటూ, రాజస్తాన్ లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ పెట్టి, అక్కడ నుంచి మన రాష్ట్రానికి సోలార్ విద్యుత్ ఇవ్వటానికి ఒప్పందం చేసుకున్నారు. దీనికి యూనిట్ ధర రూ.2.49 పడుతుంది. అయితే సోలార్ యూనిట్ ధరలు వేగంగా పడిపోతున్న ఆ సమయంలో, 25 ఏళ్ళ పాటు అగ్రిమెంట్ చేసుకోవటం, పక్క రాష్ట్రాల్లో రూ.2.49 కంటే తక్కువగా కరెంట్ రావటం, అలాగే మన రాష్ట్రంలో ప్లాంట్ పెట్టకపోవటం, ఇవన్నీ అనుమానాలకు తావు ఇస్తున్నాయి అంటూ, పయ్యావుల కేశవ్ అప్పట్లో పలు అంశాలు లేవనెత్తారు. ఇప్పుడు తాజాగా ఈనాడు మరో ఆసక్తికర విషయంతో, కధనం ప్రచురించింది. తాజాగా గుజరాత్ ప్రభుత్వం, సోలార్ విద్యుత్ ని రూ.1.99కి కొంటూ ఒప్పందం చేసుకుంది అంటూ, ఈనాడు ప్రముఖంగా ప్రచురిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న అదనపు ఖర్చు గురించి ప్రశ్నిస్తుంది. మన ప్రభుత్వం 25 ఏళ్ళ పాటు, 42,500 కోట్ల యూనిట్లను కొనటానికి, యూనిట్ రూ.2.49 కు ధర నిర్ణయిస్తు ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, ఇప్పుడు గుజరాత్ ప్రభుత్వం రూ.1.99 కే కొంటుంది. అంటే, ఒక్కో యూనిట్ కు 50 పైసలు మనం అదనంగా పెట్టి కొంటున్నాం. పక్క రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయో మన ప్రభుత్వం ఎందుకు ఆలోచించలేదు ?
ఇక్కడ మనం చూసుకుంటే, 25 ఏళ్ళ పాటు 42,500 కోట్ల యూనిట్లను మన ప్రభుత్వం కొననుంది. ఇప్పుడు 50 పైసలు అదనంగా పెట్టి మనం కొంటున్నాం. అంటే, రూ.21,250 కోట్లు అధిక బారం రాష్ట్రం పై పడనుంది. 25 ఏళ్ళలో మొత్తం రూ.1,05,825 కోట్లు వెచ్చించనున్నారు. రూ.21,250 కోట్లు అదనపు భారం పడుతుంటే, రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేస్తుంది ? ఎందుకు ఆలోచించ లేదు ? ఇంత పెద్ద మొత్తం చేసుకునేప్పుడు, మార్కెట్ లో ధరలు ఎలా ఉన్నాయో చూసుకోవాలి కదా ? కేవలం ఆరు నెలల వ్యవధిలోనే, యూనిట్ ధర భారీగా పడిపోయిన చరిత్ర ముందు ఉంది. అది చూసి కూడా, రాష్ట్ర ప్రభుత్వం అంత ఎక్కువ ధరకు ఎలా కొంటుంది ? ఇప్పుడు రాజస్థాన్ నుంచి ఇక్కడకు రావాలి అంటే, మళ్ళీ దానికి అదనంగా రూపాయి పైన పడుతుంది. ఈ భారం మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు భరించాలి ? ఇన్నాళ్ళు టిడిపి వేసిన ప్రశ్నలు రాజకీయం అనుకున్నా, ఇప్పుడు ఈనాడులో వచ్చిన కధనం చూస్తే, దీని వెనుక పెద్ద స్కెచ్ ఉన్నట్టే అర్ధం అవుతుంది. మరి ప్రభుత్వం, ఈ కధనం పై ఎలాంటి వివరణ ఇస్తుందో చూడాలి.