గత రెండేళ్లుగా కొనసాగుతున్న అమరావతి రైతుల ఉద్యమం, ఇప్పుడు ప్రభుత్వం పై మరింత ఒత్తిడి పెట్టే విధంగా సాగుతుంది. ఇన్నాళ్ళు రైతులు శాంతియుతంగా ఆందోళనలు చేసారు. వివిధ రకాలుగా తమ ఆందోళనలు తెలిపారు. ఎన్ని రకాలుగా ఆందోళనలు చేసినా, ప్రభుత్వం వారి వైపు కన్నెత్తి కూడా చూడలేదు. కనీసం మీ సమస్య ఏమిటి అని అడిగేవారు లేరు. ఇవి చేయకపోగా, వారి పై దెప్పిపొడుపు మాటలు, హేళనలు నిత్య కృత్యం అయిపోయాయి. వాళ్ళని పైడ్ ఆర్టిస్ట్ లు అని, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అని, ఇలా అనేక విధాలుగా హేళనలు చేసారు. వారి పై విష ప్రచారం చేసారు. ఎన్ని చేసినా, ఎంత చేసినా అమరావతి రైతులు మాత్రం ఎక్కడా కట్టు తప్పలేదు. తమ శాంతియుత పోరాట మార్గాన్ని వీడలేదు. తమని రక్షించేది ఈ దేశ చట్టాలు, ఆ దేవుడి అని నమ్మారు. అందుకే న్యాయస్థానం నుంచి దేవస్థానం అంటూ మహాపాదయాత్రకు శ్రీకారం చుట్టారు. అమరావతిలో ఉన్న హైకోర్టు దగ్గర నుంచి తిరుమల వెంకన్న సన్నిధి వరకు, పాదయాత్ర చేస్తున్నారు. ఈ పాదయాత్ర ద్వారా తమ బాధను, ఈ రాష్ట్ర ప్రజలకు, పాలకులకు చెప్పాలనేది వారి ఉద్దేశం. ఇందులో భాగంగానే, 47 రోజుల మహా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. గత ఏడు రోజులుగా పాదయాత్ర అద్భుతంగా జరుగుతుంది.
ఈ పాదయాత్రకు కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవటంతో, హైకోర్టుకు వెళ్లి మరీ అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి. అయితే ఈ పాదయాత్రకు ప్రజల నుంచి విపరీతమైన స్పందన వస్తుంది. అనుకున్న దాని కంటే ప్రజల నుంచి మద్దతు లభించింది. దీంతో అమరావతి రైతులు, తమకు ప్రజల నుంచి వస్తున్న మద్దతు చూసి రెట్టించిన ఉత్సాహంతో కదులుతున్నారు. చివరకు జాతీయ మీడియా కూడా రైతులు పాదయత్రను కవర్ చేస్తుంది. అయితే మన తెలుగు మీడియాలోని ఒక వర్గం మాత్రం, రైతుల పాదయాత్రను చూపించటానికే ఇస్తా పడటం లేదు. సాక్షి అంటే జగన్ ఛానెల్ కాబట్టి చూపించారు. ఎవరూ చూపించమని కోరుకోరు కూడా. అయితే రెండు ప్రముఖ చానెల్స్ మాత్రం, అమరావతి రైతుల పాదయాత్రకు కనీసం గుర్తించటం లేదు. వారికి అమరావతి రైతులు అంటే కోపమా ? లేక దీని వెనుక రాజకీయ ఒత్తిడులు ఉన్నాయా ? ఏది ఏమైనా ప్రముఖ చానెల్స్ అని చెప్పుకుంటూ, 30 వేల కుటుంబాలు చేస్తున్న ఈ పోరాటానికి, కనీస మద్దతు కూడా ఇవ్వని వెళ్ళి ఏమనాలి ?