జగన్ మోహన్ రెడ్డి పై, ఈ మధ్య కాలంలో సిబిఐ ఇంత ఘాటు వ్యాఖ్యలు చేయలేదు అనే చెప్పాలి. జగన్ మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసులు పై సిబిఐ, ఇప్పటికే అనేక చార్జ్ షీట్లు కోర్టు ముందు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తరువాత అనేక సార్లు జగన్ మోహన్ రెడ్డి పై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ వాదనలు వినిపించారు. దాదాపుగా 2017 నుంచి, జగన్ పై సిబిఐ సాఫ్ట్ గానే వెళ్తూ వచ్చింది. మొన్నటి మొన్న రఘురామకృష్ణం రాజు బెయిల్ పిటీషన్ సందర్భంగా కూడా, సిబిఐ ఒక్క మాట కూడా జగన్ కు వ్యతిరేకంగా వాదించలేదు. అలంటి సిబిఐ చాలా రోజులు తరువాత, జగన్ మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి పై సంచలన ఆరోపణలు చేసింది. జగన్ మోహన్ రెడ్డి కేసుల్లో హెటిరో కంపెనీ ఎండీ శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన జగన్ కేసుల్లో నుంచి తన పేరు కొట్టేయాలి అంటూ తెలంగాణా హైకోర్టులో క్వాష్ పిటీషన్ దాఖలు చేసారు. అయితే దీనికి కౌంటర్ ఇచ్చిన సిబిఐ, జగన్ మోహన్ రెడ్డి కంపెనీల్లో హెటిరో కంపెనీ పెట్టింది పెట్టుబడులు కాదని, ముడుపులే అని తేల్చి చెప్పింది. ఈ మొత్తం వ్యవహారం పై తమ వద్ద బలమైన ఆధారాలు ఉన్నాయని కోర్టుకు తెలిపింది. జగన్ మోహన్ రెడ్డికి చెందిన జగతి పబ్లికేషన్స్ కంపెనీలో, ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండానే, రూ.1246 కోట్లు లబ్ది పొందారనే సిబిఐ పేర్కొంది.
జగన్, విజయసాయి రెడ్డిలు కుట్ర పూరితంగా, వ్యవహరించారని, తన తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని, జగన్ ఈ ముడుపులు పొందారని పేర్కొంది. తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని, ఆ కంపెనీకి లబ్ది చేకుర్చి, క్విడ్ ప్రోకో ద్వారా పెట్టుబడులు పెట్టించారని తేల్చి చెప్పింది. ఒక పక్క ప్రభుత్వం ద్వారా భూకేటాయింపులు పొంది, తరువాత జగన్ కంపెనీల్లో, పెట్టుబడులు పెట్టటాన్ని, రెండు కలిపి చూడాలని, అందుకే ఇది క్విడ్ ప్రోకో అయ్యిందని సిబిఐ వాదించింది. ఇన్నేళ్ళు గడుస్తున్నా, ఇంకా విచారణ డిశ్చార్జ్ పిటీషన్ల దగ్గరే ఉంది అంటూ సిబిఐ కోర్టుకు తెలిపింది. హెటిరో కంపెనీ నుంచి జగతిలోకి వచ్చిన పెట్టుబడులు కరెక్ట్ అని చెప్పటానికి, విజయసాయి రెడ్డి డెలాయిట్ సంస్థ నుంచి తప్పుడు రిపోర్ట్ తెప్పించిన ఆధారాలు కూడా కోర్టు ముందు ఉంచింది. ఈ మొత్తం వ్యవహారంలో హెటిరో కంపెనీ ఎండీ శ్రీనివాస్ రెడ్డి పాత్ర ఉందని, దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయని, అందుకే అతని క్వాష్ పిటీషన్ కొట్టేయాలని సిబిఐ వాదించింది. అయితే ఇప్పుడు సిబిఐ, ఇంతలా జగన్, విజయసాయి రెడ్డిలను టార్గెట్ చేయటం పై చర్చ నడుస్తుంది.