చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పై, వైసీపీ అసెంబ్లీ సాక్షిగా చేసిన విమర్శలు, తరువాత స్పందించిన తీరు పై నందమూరి కుటుంబం ఏకం అయ్యింది. ఇప్పటికే నందమూరి ఫ్యామిలీ అంతా కలిసి ప్రెస్ మీట్ పెట్టిన సంగతి తెలిసిందే. బాలయ్య, ఇతర ఎన్టీఆర్ కుమార్తెలు, కొడుకులు, కోడళ్ళు, ఇతర కుటుంబ సభ్యులు ప్రెస్ మీట్ పెట్టి ఖండించారు. ఇప్పటికే కళ్యాణ్ రాం కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించారు. ట్విట్టర్ లో ఒక వీడియో సందేశం వదిలారు. ఆయన మాట్లాడుతూ, నిన్న అసెంబ్లీలో జరిగిన సంఘటన గురించి స్పందిస్తూ, ఇది ఒక అరాచకానికి నాంది అంటూ స్పందించారు. ఆయన మాటల్లోనే, "మాట మన వ్యక్తిత్వానికి ప్రమాణం. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సర్వ సాధారణం. ఆ విమర్శలు, ప్రతి విమర్శలు, ప్రజా సమస్యల మీద జరగాలే కానీ, వ్యక్తిగత దూషణలు, లేదా వ్యక్తిగత విమర్శలు ఉండ కూడదు. నిన్న అసెంబ్లీలో జరిగిన ఒక సంఘటన నా మనసుని కలిచి వేసింది. ఎప్పుడు అయితే మనం ప్రజా సమస్యలను పక్కన పెట్టి, వ్యక్తిగత దూషణలు మీదకి దిగుతున్నామో, ముఖ్యంగా మన ఆడపడుచుల గురించి, పరుష పదజాలంతో మాట్లాడుతున్నామో, అది ఒక అరాచక పరిపలనకు నాంది పలుకుతుంది. "
"స్త్రీ జాతిని గౌరవించటం అనేది, ఆడవాళ్ళను గౌరవించటం అనేది మన సంస్కృతి,మన నాడుల్లో, మన జీవాల్లో, మన రక్తంలో ఇమిడి పోయిన ఒక సంప్రదాయం. మన సంప్రదాయాలను రాబోయే తరాలకు, జాగ్రత్తగా , భద్రంగా అప్ప చెప్పలే కానీ, మన సంస్కృతిని కలిచి వేసి, కాల్చేసి, రాబోయే తరాలకు ఒక బంగారు బాట వేస్తున్నాం అనుకుంటుంటే, అది మన తప్పు. అది మనం చేసే చాలా పెద్ద తప్పు. ఈ మాటలో నేను, ఇలాంటి వ్యక్తిగత దూషణలకు గురైన కుటుంబానికి చెందిన వ్యక్తిగా మాట్లాడటం లేదు. ఈ మాటలు, నేను ఒక కొడుకుగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఈ దేశానికి ఒక పౌరిడిగా, సాటి తెలుగు వాడిగా మాట్లాడుతున్నాను. రాజకీయ నాయకులు అందరికీ ఒకటే విన్నపం. దయచేసి, ఈ అరాచక సంస్కృతిని ఇక్కడితో ఆపేయండి. ప్రజా సమస్యల మీద పోరాడండి. రాబోయే తరానికి బంగారు బాట వేసేలా మన నడవిక ఉండేలా జాగ్రత్త పడండి. ఇది నా విన్నపం మాత్రమే. ఇది ఇక్కడితో ఆగిపోతుందని కోరుకుంటున్నా."