ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేసిన ప్రసంగం, మన ఏపిలోని జగన్ మోహన్ రెడ్డి సహా, అనేక రాష్ట్రాల రాజకీయ పార్టీలకు కూడా తగిలింది. నిన్న హైదరాబాద్ లోని దసపల్లా హోటల్‌లో ఎమెస్కో బుక్స్ సంస్థ ప్రచురించిన నర్సరీ రాజ్యానికి రారాజు, అనే పుస్తకాన్ని ఉప రాష్ట్రపతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ మధ్య కాలంలో ప్రజలను సోమరిపోతులను చేస్తూ, ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న ఉచిత పధకాలు, దాని వల్ల ప్రభుత్వానికి ఆర్ధికంగానే కాకుండా, సమాజానికి జరిగే అన్యాయాన్ని కూడా ఆయన వివారించారు. ఈ మధ్య కాలంలో ప్రభుత్వాలు అన్నీ ఫ్రీ ఫ్రీ అంటూ, ఊదరగోడుతున్నాయని అన్నారు. ఇప్పుడు ఫ్రీ అంటే, రేపు నిజంగానే ఏమి లేకుండా ఫ్రీ అయిపోతాం అనే విషయం ప్రజలు గ్రహించాలి అని అన్నారు. చేపలు పట్టటం నేర్పించాలి కానీ, చేపలు పంచిపెట్టటం కాదని అన్నారు. అయితే వెంకయ్య ప్రసంగం పై, జగన్ వైపు విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా పడకేసి, సంక్షేమం చేస్తున్నా అంటూ అరకొర సంక్షేమంతో డబ్బా కొడుతున్న జగన్ వైపు, వేళ్ళు వెళ్తున్నాయి. మరి జగన్ గారు ఈ మాటలు వింటారో లేదో. అసలు వెంకయ్య గారు ఏమన్నారో, ఆయన మాటల్లోనే, "పని చేయటం తరువాత, ఇప్పుడు సోంబేరితనం అలవాటు అవుతుంది. ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం, సోంబేరి తనాన్ని ప్రోత్సహిస్తున్నారు కొంత మంది. అది ఫ్రీగా ఇస్తాను, ఇది ఫ్రీ గా ఇస్తాను, అది ఇచ్చేస్తా, ఇది ఇచ్చేస్తా అని. ఇలాగే కొంత కాలం కొనసాగితే, నిజంగానే మొత్తం ఫ్రీ అయిపోతుంది. "
"ఉచిత కరెంటు అంటున్నారని, అప్పట్లో నేను మాట్లాడితే, సర్ పార్టీకి నష్టం, మీరు మాట్లాడకండి అన్నారు. ఏమి కాదులే అని దాని వల్ల జరిగే నష్టాలు వివరించాను. ఫ్రీ పవర్ అంటే, ముందు లో పవర్, తరువాత నో పవర్. నో పవర్ అంటేనే ఫ్రీ పవర్. పవరే లేకపోతే ఇక బిల్లు ఎక్కడ నుంచి వస్తుంది. ప్రజలను చైతన్యవంతులను చేసి, పని చేసి, పని నేర్పించి, స్కిల్ డెవలప్ చేసి, ప్రోత్సాహకాలు కలిగించి, అన్ని సౌకర్యాలు కల్పించి, మరెక్ట్ సౌకర్యాలు కల్పించి, పని కల్పించి, వాడిని పైకి తీసుకుని రావాలి. కింద ఉన్న వాడిని పైకి తేవాలి అంటే, వాడికి చేయి ఇచ్చి పైకి లేపాలి. అంతే కాని కింద ఉన్నవాడిని ఎత్తుకుని పైకి లేపితే, రాత్రి వరకు అక్కడే ఉంటాడు. ఈ ధోరణి ఏ మాత్రం మంచిది కాదు. చేపలు పట్టటం నేర్పించు, చేపను ఇవ్వటం కాదు. అలా ఇస్తే, మధ్యానం మట్టగుడిసలు ఇస్తే, సాయంత్రం కోరమేను కావాలి అంటాడు. అది గుర్తు పెట్టుకోవాలి. ప్రతి ఒక్కరు ఇష్టపడుతూ, కష్టపడితే, నష్టపోకుండా ఉంటాం అనేది గుర్తుంచుకోవాలి." అని అన్నారు.