ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయటం అనేది గత రెండేళ్లుగా చూస్తూనే ఉన్నాం. హైకోర్టు కోర్టు ధిక్కరణ కేసులు వేసినా, ఉన్నాతధికారులను, డీజీపీని, చీఫ్ సెక్రటరీని, వివిధ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలను కోర్టుకు పిలుస్తున్నా, ప్రభుత్వ వైఖరిలో మార్పు రావటం లేదు. ప్రభుత్వ పెద్దలకు తగ్గట్టు నడుచుకుంటున్నారా, లేక అధికారులే పదే పదే తప్పులు చేస్తున్నారా అనేది తెలియదు కానీ, అధికారులకు మాత్రం కోర్టుల్లో ఇబ్బందులు తప్పటం లేదు. మనం నాలుగు రోజులు క్రిందట సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిన ఫోటో ఒకటి చూసాం. ఆ ఫోటోలో ఒక ప్రభుత్వ స్కూల్ టీచర్, స్కూల్ లో మరుగుదొడ్లు కడుగుతూ ఉన్న ఫోటో అందరం చూసాం. వస్తున్న ఫిర్యాదులకు విసుగెత్తి, ప్రభుత్వం పట్టించుకోక పోవటంతో, ప్రభుత్వ తీరుకు నిరసనగా, ఆ ప్రభుత్వం స్కూల్ టీచర్, స్కూల్ లో ఉన్న మరుగుదొడ్లు కడుగుతూ, తన నిరసనను తెలిపారు. ఈ ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. ప్రతిపక్ష పార్టీలు, ప్రజలు, ప్రజా సంఘాలు కూడా ఈ ఫోటో పై, ప్రభుత్వ తీరుని ఎండగట్టాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలియలేదు కానీ, ఫోటో వైరల్ కావటం, పౌర సమాజం స్పందించటం, అందరూ చూసారు. ఈ విషయం ప్రాముఖంగా పత్రికల్లో కూడా వచ్చింది.
అయితే నిన్న ఒక కేసు విషయంలో హైకోర్టు ఈ విషయం ప్రస్తావించింది. ఈ రాష్ట్రంలో ఉపాధ్యాయులు చదవు చెప్పే కంటే, ఇతర పనులు చేయటానికి ఉపయోగపడుతున్నారని, ఇది బాధ పడాల్సిన అంశం అని హైకోర్టు వ్యాఖ్యానించింది. విద్యా వ్యవస్థ మొత్తాన్ని నాశనం చేస్తున్నారు అంటూ, ప్రభుత్వం పై హైకోర్టు మండిపడింది. ఉపాధ్యాయులు చదువు చెప్పటం ఏమో కానీ, మిగతా అన్ని పనులు చేస్తున్నారని, చివరకు వారి చేత మరుగుదొడ్లు కూడా కడిగించే స్థాయికి తీసుకొని వచ్చారని వ్యాఖ్యానించింది. గతంలో మద్యం షాపుల ముందు, మద్యం తాగే వారిని లైన్ లో నుంచో పెట్టటానికి ఉపాధ్యాయులను వాడారని హైకోర్టు గుర్తు చేస్తింది. ఈ మధ్య కాలంలో మధ్యాహ్న భోజనం గురించి కూడా ఉపాధ్యాయులనే చూడమన్నారని, మరగు దొడ్లు నిర్వహణ పై ఫోటోలు తీసి యాప్ లో పెట్టమన్నారని, ఉపాధ్యాయులు చదువు చెప్పటానికి ఉన్నారని, ఇలాంటి పనులకు కదాని, ఇది తీవ్రమైన వ్యవహారం అని, టీచర్లను, చదువు చెప్పటానికే వినియోగించుకోవాలని, మీ ప్రభుత్వానికి చెప్పండి అంటూ హైకోర్టు, అడ్వొకేట్ జనరల్ కు సూచించింది.