సంగం డైరీ విషయంలో, ఆరోపణలు చూపించి, టిడిపి నేత ధూళిపాళ్ల నరేంద్రను ఏసిబి అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే దీని పై ధూళిపాళ్ల హైకోర్టులో కేసు వేసారు. ఒక వైపు హైకోర్టులో ధూళిపాళ్ల వేసిన క్వాష్ పిటీషన్ నడుస్తూ ఉండగానే, సంగం డైరీ యాజమాన్య హక్కులను మారుస్తూ, ప్రభుత్వం ఒక కీలక జీవోని విడుదల చేసింది. ఈ జీవోలో కొన్ని కీలక అంశాలు కూడా ప్రస్తావించారు. గుంటూరు జిల్లా పాల ఉత్పత్తి ధారుల సంఘానికి సంగం డైరీకి సంబంధించిన యాజమాన్య హక్కులను బదిలీ చేస్తున్నట్టు ప్రకటించారు. మూడు నెలల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. పాల ఉత్పత్తికి ఈ మూడు నెలల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా, గుంటూరు జిల్లా తెనాలి సబ్ కలెక్టర్ బాధ్యత వహించాలని చెప్పటం జరిగింది. ఎవరైనా సరే ఉత్పత్తికి అడ్డు పడితే వారి పై చర్యలు తీసుకునే బాధ్యతను కూడా ఆయనకు అప్పచెప్పారు. అయితే ఈ చర్య మొత్తం, రాజకీయ కక్ష సాధింపు చర్యలుగా, ప్రభుత్వం పై విమర్శలు వస్తున్నాయి. గుంటూరు పాల ఉత్పత్తి ధారుల సంఘానికి, ఏదైతే సంగం డైరీ యాజమాన్య హక్కులు ఇవ్వటం వెనుక, పది ఎకరాలు ట్రస్ట్ పేరుతో తీసుకున్నారని, ఇది తమ విచారణలో వెల్లడైంది కాబట్టి, ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది.
విస్తృత ప్రజా ప్రయోజనాల దృశ్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే ఈ ఉత్తర్వులు ఒక కుట్ర పూరితంగా ఇచ్చిందని, కుట్రతో ఉత్తర్వులు ఇచ్చారని, రైతులు కానీ, పాల ఉత్పత్తి ధారులు కానీ, ఇప్పటికే సంగం డైరీ వద్దకు చేరుకొని ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. సంగం డైరీ యాజమాన్య హక్కులను బదిలీ చేస్తూ, అకస్మాత్తుగా ఈ ఉత్తర్వులు ఇవ్వటం, ఒక వైపు కోర్టులో కేసు ఉన్నా కూడా, ఈ ఉత్తర్వులు ఇవ్వటం అనేది, కుట్ర పూరితం అని వారందరూ కూడా ఆరోపిస్తున్నారు. ఒక వైపు గుంటూరు జిల్లాకు చెందిన ఉన్నాతాధికారులు అక్కడకు చేరుకోవటంతో, అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అయితే పరిస్థితిని చక్కదిద్దేందుకే ఈ ఉత్తర్వులు ఇచ్చినట్టు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఒక వేళ హక్కులు ట్రాన్స్ఫర్ చేయకపోతే కనుక, పాల ఉత్పత్తి ఆగిపోతుంది కాబట్టి, ఈ నిర్ణయం తీసుకున్నాం అని ప్రభుత్వం చెప్తున్నా, దీని వెనుక కుట్ర ఉందని, రైతులు, పాల ఉత్పత్తిధారులు వాపోతున్నారు.