సూళ్లూరుపేట నియోజకవర్గం ఓజిలిలో తెలుగుదేశం పార్టీ ముఖ్యనాయకులను అన్యాయంగా బెదిరిస్తున్న వాకాడు సిఐ నరసింహారావు, ఎస్ఐ శేఖర్ బాబులను తక్షణమే విధులనుంచి తప్పించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. తిరుపతి ఉపఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున బూత్ ఏజంట్లను పెట్టవద్దని, ఒకవేళ పెడితే మీ సంగతి చూస్తామని సిఐ, ఎస్ఐ లు బెదిరిస్తున్నారని...వారిద్దరూ పోలీసు శాఖలో పనిచేస్తున్నారో, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ఎన్నికలయ్యాక వైసిపి ప్రభుత్వం ఇంకా మూడేళ్లు ఉంటుందని, తర్వాత మీ పరిస్థితి ఏమిటో చూసుకోవాలని అంటున్నారని, పోలీసు ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. మూడేళ్ల తర్వాత వైసిపి ప్రభుత్వం ఉండదని, ఆ తర్వాత కూడా పోలీసులు ఉద్యోగం చేయాల్సి ఉంటుందన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించపోతే భవిష్యత్ లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఆయన అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే ప్రభువులని, మిగిలిన వారు ఎవరైనా, ఎంతటివారైనా వారికి సేవకులేనన్న విషయాన్ని గుర్తు పెట్టుకొని మసలు కోవాలని అన్నారు. బెదిరింపులు, తప్పుడు కేసులతో తిరుపతి ఉపఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయాన్ని అడ్డుకోలేరని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
తిరుపతి ఉప ఎన్నికల్లో మొదలైన వైసీపీ మార్క్.... డైరెక్ట్ గా పోలీసులే ఉండటంపై, అచ్చెన్నాయుడు ఆగ్రహం..
Advertisements