తిరుపతి ఉప ఎన్నికల్లో అధికార పార్టీ చేస్తున్న అరాచకాల పై, తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఎప్పటికప్పుడు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నారు. ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ ఎంపీలు , కేంద్ర ఎన్నికల సంఘం వద్దకు వెళ్లి, ఇక్కడ జరుగుతున్న అరాచకాల పై ఫిర్యాదు చేసారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర ఎన్నికల సంఘం ఆఫీస్ లోనే, ఎన్నికల కమీషనర్ కు ఫిర్యాదు చేసారు. ముఖ్యంగా తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో, వాలంటీర్లని ఉపయోగిస్తున్నారు అంటూ, దానికి సంబంధించిన ఆధారాలు సేకరించి ఎన్నికల కమిషన్ కు ఇచ్చారు. వారు ఎన్నికల ప్రచారం చేయకుండా తగు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అలాగే కేంద్ర బలగాలతోనే ఎన్నికలు నిర్వహించాలి అంటూ, కేంద్ర ఎన్నికల సంఘాన్ని తెలుగుదేశం నేతలు కోరారు. ఇక చంద్రబాబు పై జరిగిన రాళ్ళ దాడి ఘటన పై కూడా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తూ, ఈ కేసు విషయంలో డిఐజి వ్యవహరించిన తీరు పై ఆగ్రహం వ్యక్తం చేసారు. ఒక పక్క రాళ్ళ దా-డి జరిగితే, అలా ఏమి జరగలేదని ఏకంగా డీఐజి ప్రెస్ మీట్ లో చెప్పారని, ఆధారాలు ఉంటే ఇవ్వాలని, అప్పుడు విచారణ మరింతగా చేస్తామని అంటున్నారని, ఆయన పై చర్యలు తీసుకోవాలి అంటూ టిడిపి నేతలు ఫిర్యాదు చేసారు.
అయితే తెలుగుదేశం నేతలు ఫిర్యాదు పై, కేంద్ర ఎన్నికల కమిషన్ స్పందించింది. తెలుగుదేశం నేతలు ఫిర్యాదు చేసిన లేఖకు బదులు ఇస్తూ, మరో లేఖ రాసింది కేంద్ర ఎన్నికల కమిషన్. ఎక్కువ శాతం పోలింగ్ బుతుల్లో, కేంద్రం ఎన్నికల బలగాలను దించామని సమాధానం ఇచ్చింది. ఇప్పటికే సీఆర్పీఎఫ్ బలగాలను పంపించమని, ఎక్కువ చోట్ల వారే ఉంటారని కేంద్ర ఎన్నికల సంఘం తమ లేఖలో తెలిపింది. అలాగే వాలంటీర్ల విషయంలో కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. వాలంటీర్లు ఎక్కడా ప్రచారం చెయకూడదు అని, వాలంటీర్లు ఎక్కడా కూడా ఎన్నికల ఏజెంట్లు గా ఉండ కూడదు అంటూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్టు తెలుగుదేశం ఎంపీలకు రాసిన లేఖలో తెలిపారు. తిరుపతి ఉప ఎన్నికల్లో, ఓటింగ్ ప్రశాంతంగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఎన్నికలు పారదర్శకంగా జరిపేందుకు, అన్ని విధాలుగా సమాయత్తం అవుతున్నాం అంటూ, తెలుగుదేశం ఎంపీలకు రాసిన లేఖలో కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.