తిరుపతి లోకసభ నియోజకవర్గం ఉపఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గురుమూర్తి హిందువా? కాదా? ముందు చెప్పాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రశ్నించారు. ఢిల్లీలోని తన నివాసంలో బుధవారం సాయంత్రం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో గురుమూర్తి అర్హతపై అనేక సందేహాలు లేవనెత్తారు. తిరుపతి లోకసభ నియోజకవర్గం ఎస్సీల కోసం రిజర్వ్ చేసిన నియోజకవర్గమని, అందులో ఎస్సీలు మాత్రమే పోటీ చేయడానికి అర్హులని తెలిపారు. రాజ్యాంగం ప్రకారం, హిందూ, సిక్కు, బౌద్ధమతాలను ఆచరిస్తున్నవారు మాత్రమే షెడ్యూల్డ్ కులాల జాబితాలో ఉండడానికి అర్హులని, ఏ ఇతర మతాన్ని ఆచరించే వారైనా ఎస్సీ జాబితాలో కొనసాగడానికి వీల్లేదని జీవీఎల్ స్పష్టం చేశారు. తిరుపతి వైసీపీ అభ్యర్థి గురుమార్తి గూడూరులో బిషప్ ఆశీర్వచనం తీసుకుని, ఆ దృశ్యాలను ఆయనే స్వయంగా సోషల్ మీడియాలో పోస్టు చేశారని గుర్తుచేస్తూ.. ఏమతం ఆశీర్వాదం తీసుకోవడాన్ని తాము తప్పు బట్టడం లేదని, అయితే తిరుపతి వంటి ప్రఖ్యాత ఆధ్యాత్మిక క్షేత్రంలో దర్శనం చేసు కోకుండా అన్యమత దీవెనలు మాత్రమే తీసుకోవడం కచ్చితంగా అనుమానించాల్సిన విషయమేనని జీవీఎల్ విశదీకరించారు. ఇదే విషయాన్ని లేవనెత్తినందుకు తమ పార్టీ నేత సునీల్ దేవధర్‌పై అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయననన్నారు.
సునీల్ దేవధర్ పై చేస్తు న్న వ్యాఖ్యలు చూస్తుంటే తిరుమలకు వెళ్లి గుండు చేయించుకుని, నిలువు నామాలు పెట్టుకునే ప్రతి ఒక్కరినిహేళనచేసినట్టుగానే ఉందని జీవీఎల్ మండిపడ్డారు. గురుమూర్తి నామినేషన్ పత్రాలను అంగీకరించారంటే తప్పుడు ఎస్సీ సర్టిఫికెట్ ఇచ్చినట్టేనని, అది చెల్లదని జీవీఎల్ వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు. గురుమూర్తి పోటీ చేయడానికి ఏమాత్రం అర్హత లేదని, ఆయన మరేదైనా జనరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసుకోవచ్చునని వ్యాఖ్యానించారు. గురుమూర్తి ఎస్సీ సర్టిఫికెట్ వ్యవహారంపై తాము అన్ని రాజ్యాంగ సంస్థల దృష్టికి తీసుకెళ్లి న్యాయపోరాటం చేస్తామని జీవీఎల్ ప్రకటించారు. వైకాపా ఎన్నికల పోస్టర్లో హిందూ మతాన్ని ప్రచురించడం కూడా నియమావళి ఉల్లంఘించడమేనని అన్నారు. అయితే గురుమూర్తిని వైసీపీ ప్రకటించి దాదాపుగా నెల రోజులు అవుతున్నా, పోలింగ్ కి రెండు రోజులు ముందు, జీవీఎల్ ఇప్పుడు ఎందుకు ఈ ఆరోపణలు చేస్తున్నారో అర్ధం కావటం లేదు.