ప్రపంచాన్ని కుదిపేస్తున్న క-రో-నా మహమ్మారి కారణంగా తిరుమల శ్రీవారి ఆలయంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. టీటీడీ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా గతేడాది 80 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో దర్శనాలు నిలిచిపోయాయి. అటు తరువాత కో-వి-డ్ నిబంధనలను పాటిస్తూ శ్రీవారి దర్శనాలను ప్రారంభించిన టిటిడి పరిస్థితులను అంచనా వేసుకుంటూ దశలవారిగా భక్తుల సంఖ్యను పెంచుతూ వచ్చి, గత నెల వరకు నిత్యం 55 వేల మంది భక్తులను శ్రీవారి దర్శనాన్ని కల్పించింది. ఇందులో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల ద్వారా 25 వేల మంది, సర్వదర్శనం టోకెన్ల ద్వారా 22 వేల మంది, విఐపి బ్రేక్ దర్శనం, అర్జితసేవా టికెట్లు, సుప్రభాతం టికెట్ల ద్వారా మరో 8 వేల మంది భక్తులకు దర్శనాన్ని కల్పించింది. ఇలా అంచెలంచెలుగా శ్రీవారి దర్శనాన్ని పెంచుతూ భక్తులకు దర్శనాన్ని కల్పిస్తున్న టిటిడి పై క-రో-నా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ పడింది. గత పది రోజులలోనే చిత్తూరు జిల్లాలో పదుల సంఖ్యలో కేసులు వందల సంఖ్యకు పెరగడంతో పాటు దేశ వ్యాప్తంగ పలు రాష్ట్రాల్లో వేల సంఖ్యలో కేసులు బయట పడుతుండడంతో శ్రీవారి దర్శనార్థం మన రాష్ట్రం నుంచే కాక దేశ వ్యాప్తంగా భక్తులు తిరుమలకు వస్తుండడంతో టిటిడి అలెర్ట్ అయింది. క-రో-నా బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంతో ఈ నెల 11వ తేదీ సాయంత్రం నుంచి సర్వదర్శనం టోకెన్ల జారిని నిలిపివేస్తున్నట్లు టిటిడి ఇప్పటికే ప్రకటించింది. ఇప్పటికే విక్రయించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను పొందిన భక్తులను మాత్రమే టిటిడి శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నది. ముందుగా ప్రత్యేక ప్రవేస దర్శనం టికెట్లను ఆన్లైన్లో భక్తులకు విక్రయించడంతో ఆ టికెట్లను పొందిన భక్తులు వారికి కేటాయించిన సమయానికి కొద్ది గంటల ముందు తిరుమలకు చేరుకుని స్వామివారిని దర్శించు టుండడంతో ఈ టికెట్లు పొందిన భక్తులు ఎక్కువసేపు తిరుమలలో బసచేసే అవకాశం లేక పోవడంతో టిటిడి సర్వదర్శనం టోకెన్ల జారిపై దృష్టి సారించింది.
ప్రతినిత్యం సర్వదర్శనం టోకెన్లను టిటిడి తిరుపతిలో ఏర్పాటు చేసిన భూదేవి కాంప్లెక్స్, విష్ణునివాసంలోని కౌంటర్లలో జారీ చేస్తుంది. ముందు వచ్చిన వారికి ముందున్న అన్న విధంగా టిటిడి టోకెన్లు జారి చేస్తుంది. భక్తుల తాకిడి దృష్ట్యా నాలుగు ఐదు రోజులకు సరిపడిన టోకెన్లు జారీ చేసింది. టోకెన్లు పొందిన భక్తులు దాదాపు 48 నుంచి 72 గంటల పాటు తిరుపతిలోనే బస చేస్తుండడంతో క-రో-నా వ్యాప్తి చెందే అవకాశం ఉందని భావించిన టిటిడి ఈనెల మొదటి నుంచి సర్వదర్శనం టోకెన్ల జారిని 22 వేల నుంచి 15 వేలకు కుదించింది. దీంతో ఏప్రిల్ మొదటి నుంచి స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 55 వేల నుంచి 48 వేలకు తగ్గింది. గత కొద్దిరోజులుగా చిత్తూరు జిల్లాలో కేసుల సంఖ్య క్రమేణా పెరుగుతుండడంతో పరిస్థితులను సమీక్షించిన టిటిడి సర్వదర్శనం టోకెన్లను పొందిన వారు ఎక్కువ రోజులు ఉండాల్సి వస్తుండడంతో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉండడంతో సర్వదర్శనం టోకెన్ల జారిని కొద్దిరోజుల పాటు పూర్తిగా రద్దు చేయాలని నిర్ణయించి ఆమేరకు టిటిడి ఒక ప్రకటన విడుదల చేసింది. క-రో-నా విస్తృతంగా వ్యక్తి చెందుతున్న నేపథ్యంలో ఇప్పటికే కరోనా వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా దేశంలోనే ప్రముఖ ఆలయమైన షిరిడి సంస్థాన్‌లో ఈ నెల 30వ తేది వరకు దర్శనాలను రద్దు చేశారని, అలానే తిరుమలలో కరోనా వ్యాప్తి అడ్డుకట్టలో భాగంగా సర్వదర్శనం టోకన్ల జారిని 11వ తేది సాయంత్రం నుంచి పూర్తిగా రద్దు చేస్తున్నట్లు టిటిడి ప్రకటించింది. దీంతో ఆదివారం సాయంత్రం నుంచి సర్వదర్శనం టోకెన్ల జారి రద్దు కానుంది. ఇక ఇప్పటికే ఆన్లైన్లో ఏప్రిల్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విక్రయించడంతో ఆ టికెట్లను పొందిన భక్తులను మాత్రం టిటిడి శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నది. రాబోయే రోజులలో ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేస్తూ దర్శనం కొనసాగింపుపై టిటిడి నిర్ణయం తీసుకోనున్నది.