తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ముఖ్య నేతల సమావేశం నిన్న జరిగింది. ప్రజలు, రాష్ట్రం ఎదుర్కొంటున్న పలు సమస్యలు చర్చించి తీర్మానాలు చేసారు. మొదటిది.. "జగన్ రెడ్డి అసమర్ధత, బలహీనతల వల్లే రాయలసీమ పొలాలకు పారాల్సిన కృష్ణా జలాలు నేడు సముద్రం పాలవుతున్నాయి. శ్రీశైలం రిజర్వాయర్ ను ఖాళీ చేస్తుంటే ఉత్తుత్తి లేఖలతో సీఎం కాలక్షేపం చేస్తున్నారు. కేసుల మాఫీ కోసం ప్రత్యేక విమానాలల్లో ఢిల్లీకి వెళ్లే సీఎం ఇంత పెద్ద సమస్యపైన ఎందుకు ఢిల్లీ వెళ్లి పీఎం, జలశక్తి మంత్రిని కలవడం లేదు? తమపై పెరుగుతున్న ప్రజా వ్యతిరేకత, నిరుద్యోగ వ్యతిరేకత, యువత వ్యతిరేకత నుండి, హోల్ సేల్ అవినీతి నుండి ప్రజల దృష్టి మళ్లించేందుకు కూడబలుక్కొని సెంటిమెంట్ రెచ్చగొట్టే కపటనాటం ఆడుతున్నారు. అందుకే ఉత్తుత్తి లేఖలకు పరిమితమయ్యారు. తెలంగాణలోని అక్రమ ఆస్తులను కాపాడుకునేందుకు నదీ జలాల్లో ఆంధ్రప్రదేశ్ కు ఉన్న న్యాయ బద్దమైన హక్కులను వదిలేసి రైతులను రోడ్డు మీద పడేస్తున్నారు. బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన హక్కుల్ని, లోయర్ రైపేరియన్ స్టేట్ హక్కుల్ని, అపెక్స్ కౌన్సిల్ లో చేసుకొన్న ఉమ్మడి తీర్మానాన్ని రక్షించాల్సిన బాధ్యత , అధికారం జగన్ రెడ్డి ప్రభుత్వం వద్ద ఉంది. తన బాధ్యతను గాలికొదిలేసి ప్రతిపక్షాలపై నిందలు మోపి తప్పించుకోవాలని చూస్తే ప్రజలు బుద్ది చెప్పకమానరు. సాగు నీటి ప్రాజెక్టుల నిర్మాణాలకు తెలుగుదేశం ప్రభుత్వం ఏడాదికి సరాసరి రూ.13వేల కోట్లు ఖర్చు చేయగా ఈ ప్రభుత్వం అందులో సగం కూడా ఖర్చు చేయలేదు. రాయలసీమ ప్రాజెక్టులపై టిడిపి ప్రభుత్వం 5 ఏళ్లల్లో రూ.9,500 కోట్లు ఖర్చు చేసింది. రెండేళ్లల్లో జగన్ రెడ్డి ఎంత ఖర్చు పెట్టారో చెప్పే ధైర్యం ఉందా? గండికోట, పోలవరం నిర్వాసితులకు పరిహారం, పునరావాసం ఇవ్వకుండా వారిని నీట ముంచారు. పురుషోత్తపట్నం ట్రిబ్యునల్ లో ఆగిపోవడానికి వీరి అసమర్ధత కారణం కాదా? జల యజ్ఞంలో ధనయజ్ఞానాన్ని కప్పి పెట్టుకోవడానికి కృష్ణా మిగులు జలాల్లో హక్కు కోరబోమని వైఎస్ ప్రభుత్వం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు లేఖ ఇచ్చి రాయలసీమ ద్రోహం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం జ్యోతిబసు ఆధ్వర్యంలో ముఖ్యమంత్రుల కమిటీ ఏర్పాటు చేయించి ఆల్ మట్టి ఎత్తు పెంచకుండా అడ్డుకోవడం జరిగింది. జగన్ రెడ్డి శ్రీశైలంలో నీటి హక్కుల్ని కాపాడలేక చేతులెత్తేసి పుట్టిన గడ్డకు ద్రోహం చేస్తున్నారు.
చంద్రబాబు కృషి వలన కె.ఆర్.ఎం.బి కార్యాలయాన్ని హైదరాబాద్ నుండి విజయవాడ తరలించడానికి అపెక్స్ కౌన్సిల్ లో చర్చకు పెట్టారు. తదనంతరం తెలంగాణ ప్రభుత్వం ఆమోదించింది. కె.ఆర్.ఎం.బి కూడా తరలింపుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ నోట్ విడుదల చేయడమే కాకుండా ఛైర్మన్ స్వయంగా విజయవాడ వచ్చి కార్యాలయానికి అనువైన భవనాలను పరిశీలించి వెళ్లడమైంది. దీన్ని సాకారం చేయకుండా జగన్ రెడ్డి వేరే చోటకు తరలించాలని ప్రయత్నించడం వలన అది హైదరాబాద్ లో ఉండిపోయింది. కె.ఆర్.ఎం.బీ ఏపీ ఫిర్యాదుల్ని పట్టించుకోకుండా తెలంగాణకు అనుకూలంగా ఉందని ఈ రోజు సీఎం లేఖలో ప్రస్తావించారు. కె.ఆర్.ఎం.బి విజయవాడకు వచ్చి ఉంటే ఈ దుస్థితి వచ్చి ఉండేదా? ఈ స్థితికి కారణం సీఎం కాదా? ముచ్చుమర్రి ప్రాజెక్టు రాయలసమీకు మరో జీవనాడి. 792 అడుగుల నుండి నీరు తీసుకోవచ్చు. దీని నుండి రాయలసీమలోని అన్ని కెనాల్స్ కు నీరు ఇవ్వొచ్చు. దీనిపై వివాదాలు లేవు. చంద్రబాబు ప్రభుత్వం ముచ్చుమర్రిలో మూడు తూముల్లో నీరు విడుదల చేశారు. మిగిలిన 13 తూములు ఏ వివాదం లేకుండా ఈ రెండేళ్లల్లో పూర్తి చేసి ఉండవచ్చు. ముచ్చుమర్రి నుండి బనకచర్ల క్రాస్ రెగ్గులేట్ కు అనుసంధానం అవకాశం కల్పించి ఉన్నారు. దీని ద్వారా హంద్రీ నీవా, గాలేరు నగరి, ఎస్ఆర్బీసీ, కెసికెనాల్, తెలుగుగంగకు నీరు ఇచ్చే అవకాశం ఉంది. దీన్ని రెండేళ్లైనా పూర్తి చేయకుండా జగన్ రెడ్డి పుట్టిన గడ్డకు ద్రోహం చేశారు. దీనికి కారణం కేసీఆర్ తో లాలూచి కాదా? ఏమీ చేయకుండానే ఏదో చేయబోతుంటే ఎవరో అడ్డుకున్నారనే బ్లేమ్ గేమ్ తో, సెంటిమెంట్ రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకొనే కుట్రే నేటి జల జగడం. దీన్ని అర్ధం చేసుకోలేని అమాయకులు కాదు రాయలసీమ ప్రజలు. జగన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే క్రింది కార్యక్రమాలు చేపట్టాలి. 1. కృష్ణా జల వివాదంపై వెంటనే సీఎం: అఖిలపక్షాన్ని ప్రధాని, జలశక్తి మంత్రి వద్దకు తీసుకెళ్లాలి. 2. నదుల అనుసంధాన ప్రణాళికకు నిధులు కేటాయించి రాయలసీమ, ఉత్తరాంధ్రలకు సాగు, తాగు నీటి సౌకర్యం కల్పించాలి. కృష్ణా, గోదావరి డెల్టా ఆయకట్టు స్థిరీకరించాలి. 3. ముంపు రైతులకు, ఆదివాసీలకు పరిహారం, పునరావాసం కల్పించి అన్ని రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్ధ్యం పెంచాలి. 4. ముచ్చుమర్రి పెండింగ్ పనులు పూర్తి చేసి రాయలసీమలోని అన్ని ప్రాజెక్టులకు నీరు ఇవ్వాలి. 5. గోదావరి – పెన్నాలో భాగమైన వైకుంఠపురం ప్రాజెక్టు బొల్లా రిజర్వాయర్ పూర్తి చేసి, బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ తో లిండ్ చేయాలి. 6. గుండ్రేవుల, వేదవతి పూర్తి చేయాలి. తుంగభద్ర హైలెవల్ కెనాల్ కు ప్యారలల్ కెనాల్ నిర్మించాలి. 7.వెలిగొండ రెండు టన్నళ్లు, రిజర్వాయర్లు, సప్లై చానల్స్ పనుల పూర్తి చేయాలి. 8. హంద్రీ నీవా, గాలేరు నగరి పెండింగ్ పనులకు నిధుల కేటాయింపులు పెంచాలి.